Advertisement
రైతు రాజ్యం నినాదం అందుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ను ఇతర రాష్ట్రాలకు విస్తరించేందుకు చూస్తున్నారు. ఈమధ్య తెలంగాణ గడ్డపై ఆవిర్భావ సభను నిర్వహించారు. తాజాగా మహారాష్ట్ర గడ్డపై కేంద్రంపై సమరశంఖం పూరించారు. ఓవైపు మహారాష్ట్రకు వరాలు కురిపిస్తూనే ఇంకోవైపు మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నాందేడ్ లో భారీ బహిరంగ సభను నిర్వహించారు కేసీఆర్. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే కొందరు సర్పంచులు, నేతలు బీఆర్ఎస్ గూటికి చేరారు. పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు కేసీఆర్.
Advertisement
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు కేసీఆర్. త్వరలోనే గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల్లోనే గ్రామ కమిటీలు నియమిస్తామని.. త్వరలో విదర్భలోనూ పర్యటిస్తానని తెలిపారు. రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటుదామని ప్రజలకు కేసీఆర్ పిలునిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని, ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.
75 ఏళ్లలో 70 ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ పాలించాయని.. ఒకరు అంబానీ అంటే మరొకరు అదానీ అంటూ దేశాన్ని దోచి పెడుతున్నారని మండిపడ్డారు కేసీఆర్. మేకిన్ ఇండియానూ జోకిన్ ఇండియాగా మార్చారని ఫైరయ్యారు. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తాను జాతీయ రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చిందని.. అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అనేది బీఆర్ఎస్ నినాదమని తెలిపారు. దేశంలో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఉందన్న ఆయన… రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్యకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. ఆ పరిస్థితులు ఎందుకు ఉన్నాయిని అడిగారు కేసీఆర్. రైతులు హలం దున్నటం కాదు.. కలం పట్టి దేశ చరిత్రను మార్చాలని చెప్పారు. అప్పుడే దేశంలో రైతు రాజ్యం వస్తుందని తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం తెలంగాణలో కరెంట్ కష్టాలు ఉండేవని… కానీ, అంతా మారిపోయిందని వివరించారు. 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో సాధ్యమైనప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదన్నారు. దేశంలో బొగ్గును సద్వినియోగం చేసుకుంటే 125 ఏళ్లపాటు కరెంట్ సమస్య తీరుతుందని చెప్పారు.
సభ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లోనూ మోడీ సర్కార్ ను టార్గెట్ చేశారు కేసీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీ లాభాల్లో కొనసాగుతుండగా.. దాన్ని ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ భారీగా పెట్టుబడి ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడిగారు. సాధారణ వ్యాపారి అయిన అదానీ.. రెండేళ్లలోనే ప్రపంచ కుబేరుల్లో మూడోస్థానానికి ఎలా ఎదిగారు? అని ప్రశ్నించారు. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేయాలన్న ఆయన.. ఈ వ్యవహారంపై పార్లమెంట్ లో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ మిత్రుడైన అదానీని కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదానీపై ఉన్న ప్రేమ దేశం ప్రజలపైనా ఉండాలన్నారు కేసీఆర్.