Advertisement
తెలంగాణలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్షాలు పాదయాత్రలు అంటూ హడావుడి చేస్తున్నాయి. జనాల్లోనే ఉంటూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే.. ప్రభుత్వం అభివృద్ధి మంత్రం జపిస్తోంది. ఇప్పటిదాకా చేసింది.. ఇక చేయబోయేది ఏంటో జనానికి గట్టిగా వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాలు దాటడం లేదు. కొన్నిచోట్ల ప్రజలు ఎదురుతిరుగుతున్నా.. ఏదో ఒకటి చెప్పి మ్యానేజ్ చేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజలను బుట్టలో వేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
Advertisement
ఈ ఏడాది బడ్జెట్ ను కూడా సంక్షేమ మంత్రం నింపేశారు కేసీఆర్. ప్రధాన పథకాలు, శాఖలకు వేల కోట్ల ప్రతిపాదనలు చేశారు. సంక్షేమంతోపాటు సాగుకు పెద్దపీట వేస్తూ భారీ బడ్జెట్ తీసుకొచ్చింది. ప్రస్తుత కార్యక్రమాల కొనసాగింపు, ఎన్నికల హామీలే ధ్యేయంగా పద్దు ప్రవేశపెట్టింది. సొంత ఆదాయంపై ఎక్కువగా ఆధారపడుతూ ఆశావహ బడ్జెట్ తీసుకొచ్చిన సర్కార్.. కేంద్రం సహకరించడం లేదంటూనే గ్రాంట్లపై ఆశలు పెట్టుకొంది. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని కేటాయింపులు చేసింది.
Advertisement
ఇది సామాన్యుడి బడ్జెట్ అని బీఆర్ఎస్ వర్గాలు అంటుంటే.. పక్కా ఎన్నికల బడ్జెట్ అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అంకెల గారడీ.. గందరగోళమైన బడ్జెట్ అని తిట్టిపోస్తున్నాయి. గత బడ్జెట్ హామీలను ఇంకా నెరవేర్చలేదని.. ఇప్పుడు మరోసారి మోసానికి తెర తీశారని విమర్శలు చేస్తున్నాయి. ఈ సందర్భంగా బడ్జెట్ లో ప్రస్తావనకు రాని అంశాలను హైలైట్ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. నిరుద్యోగ భృతి, గిరిజన బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లు, పంట బీమా ఇలా ప్రస్తావనకు రాని అంశాలను గుర్తు చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.
గత సంవత్సరం రూ.2,56,958.51 కోట్ల బడ్జెట్ ను ప్రకటించింది ప్రభుత్వం. దాన్ని రూ.2,37,611.52 కోట్లకు సవరించింది. అయినా.. ఈసారి సవరించిన బడ్జెట్ కు 22.21శాతం(రూ.52,784.48 కోట్లు) పెంచి రూ.2.90 లక్షల కోట్లను ప్రతిపాదించింది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఈ ప్రతిపాదనలను నిజంగా అమలు చేస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష నేతలు మాత్రం.. ఇది డొల్ల బడ్జెట్ అని తేల్చేస్తున్నారు. మరి.. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్ముతారా? బడ్జెట్ కలిసివస్తుందా? అనేది చూడాలి.