Advertisement
ఏపీకి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం. దీన్ని కేంద్రమే ఎన్నో సార్లు స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని పార్లమెంట్ సాక్షిగా పలుమార్లు స్పష్టం చేసింది. అయినా.. ఏపీలోని పార్టీలు దీన్ని రాజకీయంగా వాడుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ అయితే.. ఈ అంశాన్ని ఎప్పుడో మర్చిపోయింది. కేంద్రంతో దగ్గరగా మెలగడమే అందుకు కారణం. అయితే.. సడెన్ గా హోదా గుర్తుకొచ్చింది ఆ పార్టీకి.
Advertisement
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో మాట్లాడుతూ.. విభజన నాటి హామీలను గుర్తు చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగించిన ఆయన.. మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు, విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపైనా కేంద్రాన్ని నిలదీశారు.
Advertisement
ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్న విజయసాయి.. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ మర్చిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యాల వల్లే ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగింది అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాకు కేంద్రం అంగీకరించిందన్న ఆయన.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని విమర్శించారు.
అయితే.. సడెన్ గా ప్రత్యేక హోదా అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏంటనే చర్చ సాగుతోంది. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కేంద్రం దగ్గర జగన్ తల వంచేశారనే ఆరోపణల నేపథ్యంలో తిరుగుబాటు డ్రామా మొదలుపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇన్నేళ్ల కాలంలో గుర్తుకురాని హోదా ఇప్పుడు సడెన్ గా ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.