Advertisement
ఈమధ్య పొత్తుల విషయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. ఈ విషయంలో ఆయన క్లారిటీ ఇచ్చినా.. ఓ వర్గం మాత్రం కావాలనే ఆయన్ను టార్గెట్ చేస్తోంది. అయితే.. పార్టీ ఇంచార్జ్ థాక్రే కలగజేసుకున్నాక అంతా సద్దుమణిగింది. అయితే.. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి ఓ కార్యక్రమానికి వెళ్లగా.. బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై ఎంపీ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
శాలిగౌరారం మండలం ఇటుకులపాడు గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రోడ్లు బాగాలేవంటూ విమర్శించారు. ఇటుకులపాడుకు ప్రధాన రహదారి నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ కాస్త దూరానికే తనకు గంట సమయం పట్టిందని తెలిపారు.
Advertisement
వెయ్యి కోట్లతో ప్రగతి భవన్ కట్టుకున్న సీఎం.. కోటి రూపాయలు ఇచ్చుంటే ఇక్కడి రోడ్డు బాగుపడేదని అన్నారు కోమటిరెడ్డి. ఇటుకలపాడులో పేదలకు ఇండ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. దీంతో అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. వెంకట్ రెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పర్యటన మధ్యలోనే ముగించుకొని వెంకట్ రెడ్డి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎంపీ మాటల్లో తప్పేముందని.. 3 కిలోమీటర్లకే గంట ప్రయాణం పట్టడం ఏంటని కాంగ్రెస్ శ్రేణులు నిలదీశారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రోడ్లు సరిగ్గా లేవని మండిపడ్డారు.