Advertisement
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఎక్కడా తగ్గకుండా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటూ జగన్ సర్కార్ ఫై నిప్పులు చెరుగుతున్నారు లోకేష్. 21వ రోజు సత్యవేడు నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. రాయపేడు విడిది కేంద్రం నుంచి యాద్ర మొదలుపెట్టి ముందుకు సాగారు. కేవీబీ పురంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాజుల కండ్రిగలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
Advertisement
మధ్యాహ్నం రాగిగుంటలో భోజనం విరామం తర్వాత పాదయాత్ర తిరిగి ప్రారంభించారు లోకేష్. తర్వాత తిమ్మనాయుడు ముదిరాజ్ కులస్తులతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించామని, స్వయం ఉపాధిని ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. అమరరాజా పక్క రాష్ట్రానికి పోయిందని, 20 వేల మంది రాయలసీమ యువతకు ఉద్యోగ అవకాశాలు పోయాయని మండిపడ్డారు.
Advertisement
రైతులతో ముఖాముఖి సందర్భంగా మాట్లాడిన లోకేష్.. వ్యవసాయం, అనుబంధ రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. రైతులకు సబ్సిడీ రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం దగా చేస్తోందని విమర్శించారు. ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ జగన్ రాష్ట్రాన్ని రైతు లేని రాజ్యంగా తయారు చేశారని ఆరోపించారు. రుణమాఫీ, సబ్సిడీ రుణాలు, గిట్టుబాటు ధర, భూసార పరీక్షలు లేకుండా అన్నదాతలను దగా చేశారని విమర్శించారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీమపై ప్రేమ లేని జగన్ రెడ్డి రాయలసీమలో ఎలా పుట్టారని ప్రశ్నించారు లోకేష్. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇక పాదయాత్ర సందర్భంగా లోకేష్ కు ఓ బస్సు తారసపడింది. దీంతో దగ్గరికి వెళ్లిన ఆయనకు అది డిక్సన్ కంపెనీ ఉద్యోగులదని తెలిసింది. దీంతో వారితో సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా జగన్ కు సవాల్ చేశారు లోకేష్. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదని టీడీపీ చేస్తున్న విమర్శల్ని గుర్తుచేస్తూ.. ‘‘మిస్టర్ జగన్ రెడ్డి నేను తెచ్చిన డిక్సన్ కంపెనీ ఇది.. అందులో ఉద్యోగాలు చేస్తున్న అక్కాచెల్లెళ్లు వీళ్లు. నువ్వు ఒక్క కంపెనీ అయినా తెచ్చావా? ఒక్క ఉద్యోగమైనా ఇప్పించగలిగావా?’’ అంటూ ప్రశ్నించారు లోకేష్.