Advertisement
ఏపీ సర్కార్ ఎక్కడ దొరుకుతుందా? ఓ ఆటాడుకుందామని ప్రతిపక్షాలు ఎదురుచూస్తున్నాయి. ఓవైపు మూడు రాజధానుల రాజకీయంపై నిలదీస్తూనే ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన సంఘటన విపక్షాలకు ఆయుధంగా మారింది.
Advertisement
వివరాల్లోకి వెళ్తే.. ముంచింగిపుట్టు మండలం కుమడకు చెందిన మహేశ్వరి, కొండబాబు దంపతులు.. తమ చిన్నారిని వైద్యం కోసం కేజీహెచ్ కు తీసుకెళ్లారు. అయితే.. చికిత్స పొందుతూ పసిబిడ్డ మృత్యువాత పడింది. తిరిగి ఇంటికి తీసుకెళ్ళేందుకు అంబులెన్స్ కావాలని తల్లిదండ్రులు ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. లేదని చెప్పడంతో బిడ్డ మృతదేహాన్ని చేతుల్లో పెట్టుకుని స్కూటీపై 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాడేరుకి ప్రయాణం చేశారు ఆ దంపతులు. విషయం తెలుసుకున్న పాడేరు ఆసుపత్రి సిబ్బంది స్వగ్రామానికి అంబులెన్స్ ఏర్పాట్లు చేశారు.
Advertisement
ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘‘ఆ దంపతుల వేదన విన్న ఎవరికైనా గుండె కరుగుతుంది. పాషాణ ప్రభుత్వంలో మాత్రం స్పందన ఉండదు. బిడ్డ మృతదేహంతో 120 కి.మీ. మోటార్ సైకిల్ మీద వెళ్ళిన ఆ గిరిజన దంపతులకు వైసీపీ సీఎం క్షమాపణలు చెప్పాలి. కేజీహెచ్ లో గిరిజనులకు సాయపడేందుకు ఎస్టీ సెల్ ఉన్నా, ఆసుపత్రిలో ఉన్నతాధికారులు ఉన్నా పట్టించుకోకపోవడం అమానవీయం’’ అని మండిపడ్డారు.
ఇక టీడీపీ నేత లోకేష్ స్పందిస్తూ.. ‘‘రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో మీకంటే బెటర్ పబ్జీ ప్లేయర్ గారూ! పసిగుడ్డు మృతదేహాన్ని విశాఖ నుంచి 120 కిలోమీటర్లు బైకుపై పాడేరు తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రుల కష్టం విన్న మాకే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. మీ కరకు గుండె మాత్రం కరగదు. రోజుకో అమానవీయ ఘటన, పూటకో దయనీయ దృశ్యం మీ దరిద్ర పాలనలో సర్వసాధారణమైపోయాయి. వైద్యానికి వెళితే నిర్లక్ష్యం. చనిపోయిన వారిని తరలించేందుకు అంబులెన్సులు రావు. నిరుపేదలు చనిపోతే అనాధ శవాల్లా పడి వుండడమేనా?’’ అని ప్రశ్నించారు.