Advertisement
ఏపీలోని గన్నవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి టీడీపీ ఆఫీస్ కు కొందరు నిప్పుపెట్టారు. కార్యాలయం అద్దాలు, ఫర్నీచర్, వాహనలు ధ్వంసం చేశారు. ఇది ముమ్మాటికీ ఎమ్మెల్యే వంశీ అనుచరలేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారన్నారు చంద్రబాబు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ అని.. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారకులపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు చంద్రబాబు.
Advertisement
గన్నవరం టీడీపీ కార్యాలయానికి బయలుదేరిన పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారని.. ఆచూకీ కూడా తెలియడం లేదని కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టాభిరామ్ భార్య చందన ఓ వీడియో బైట్ ను విడుదల చేశారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని, తన భర్తకు ఏ హాని జరిగినా సీఎం, డీజీపీ లే బాధ్యత వహించాలని అన్నారు.
నారా లోకేష్ స్పందిస్తూ.. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. టీడీపీపై జగన్ రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క అని హెచ్చరించారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగలబెడుతుంటే.. పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అంటూ మండిపడ్డారు. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన గన్నవరం నొటోరియస్ క్రిమినల్ కి పోగాలం దాపురించిందని అన్నారు. ఆడిన ప్రతీ తప్పుడు మాటకి, చేసిన ప్రతీ దుర్మార్గ పనికి పశ్చాత్తాప పడే రోజు దగ్గర పడిందని హెచ్చరించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని.. పార్టీ అండగా ఉంటుందని.. అరాచకుడి దురాగతాలకు బుద్ధి చెబుదామని ధైర్యం చెప్పారు లోకేష్.