Advertisement
ఈమధ్య తెలంగాణలో వరుసగా విద్యార్థుల చావులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రీతి ఘటన తర్వాత వరుసగా మరో మూడు ఘటనలు వెలుగుచూశాయి. వీటిలో మూడింటి వెనుక వేధింపులే కారణం కావడం చర్చనీయాంశంగా మారింది.
Advertisement
సంచలనం రేపిన ప్రీతి మరణానికి సీనియర్ సైఫ్ వేధింపులే కారణం. చాలాకాలంగా ఇవి కొనసాగుతున్నా.. తట్టుకుని ధైర్యంగా నిలబడిండి ప్రీతి. కానీ, రోజులు గడిచే కొద్దీ ఎక్కువవడంతో మృత్యుఒడికి చేరింది. ఇది ఆత్మహత్యనా? హత్యనా? అనేది ప్రస్తుతం మిస్టరీగా ఉంది. బాధిత కుటుంబం మాత్రం ముమ్మాటికీ హత్యేనని అంటోంది. హెచ్ఓడీ తీరును తప్పుబడుతోంది.
ప్రీతి ఘటనపై చర్చ సాగుతుండగానే వరంగల్ లో మరో దారుణం వెలుగుచూసింది. రాహుల్ అనే యువకుడి వేధింపులు భరించలేక రక్షిత అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పదో తరగతి చదివే రోజుల్లో పరిచయమైన రాహుల్ గత కొన్నాళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడు. గతంలో దిగిన చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని భయభ్రాంతులకు గురిచేశాడు. దీంతో రక్షిత ఆత్మహత్యకు పాల్పడింది.
Advertisement
ఇటు నిజామాబాద్ లో హర్ష అనే విద్యార్థి హస్టల్ గదిలో ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యతో కళాశాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ కుమారుడు మెరిట్ స్టూడింట్ అని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని మృతుడి తల్లి రాధ అన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని.. రాత్రే తనతో మాట్లాడినట్లు తెలిపారు. అయితే.. కాలేజీ యాజమాన్యం మాత్రం అనారోగ్య సమస్యలతోనే చేసుకుని ఉండొచ్చని ప్రకటించింది. ఈ మృతిపై అనేక అనుమానాలున్నాయి.
ఇలా వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తుండగా.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఏకంగా క్లాస్ రూంలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం ఒత్తిడి కారణంగానే సాత్విక్ ఇలా చేసుకున్నాడని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్ళలేదని చెబుతున్నారు. ఇలా వరుసగా వారం రోజుల వ్యవధిలోనే వేధింపుల కారణంగా విద్యార్థులు బలవ్వడం హాట్ టాపిక్ గా మారింది.