Advertisement
శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. నార్సింగి బ్రాంచ్ లో క్లాస్ రూమ్ లోనే సాత్విక్ చనిపోయాడు. దీనిపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలు ఫీజుల దోపిడీపై పెడుతున్న శ్రద్ధ విద్యార్థులపై పెట్టడం లేదని ఫైరవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాత్విక్ కుటుంబాన్ని కలిసి ఓదార్చుతున్నారు నేతలు.
Advertisement
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సాత్విక్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని కలిసి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా? అని ప్రశ్నించారు వెంటనే కాలేజ్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ల ఒత్తిడి వల్లే సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి విద్యార్థులు చెబుతున్నారన్నారు.
Advertisement
మరొకరు బలవ్వకుండా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు వెంకట్ రెడ్డి. విద్యార్ధులను ఇష్టం వచ్చినట్లు కొట్టిన కాలేజీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని.. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇటు పోలీసుల తీరుపైనా మండిపడ్డారు కోమటిరెడ్డి. కాలేజీ యాజమాన్యానికి వత్తాసు పలికేలా సీఐ వ్యవహరిస్తున్నారని.. సూసైడ్ లేఖలో పేర్కొన్న వ్యక్తులను అరెస్ట్ చేశారా? అని ప్రశ్నించారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్న తనతో మాట్లాడే తీరు ఇదేనా అంటూ సీఐపై సీరియస్ అయ్యారు.
నారాయణ, శ్రీచైతన్య కాలేజీ యాజమాన్యాలకు పోలీసులు అమ్ముడుపోయారా? అని ప్రశ్నించారు. సాత్విక్ సూసైడ్ లెటర్ లో ప్రస్తావించిన వేధింపులను గుర్తు చేసిన ఆయన ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఏపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న తీరును వివరించారు. చిత్తూరులో టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు.