Advertisement
దేశ రాజకీయాల్లో పెగాసస్ దుమారం అంతా ఇంతా కాదు. ప్రతిపక్షాలు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు చేశాయి. మీడియా ముందు గగ్గోలు పెట్టాయి. కేంద్రం తమపై నిఘా పెట్టిందని.. ఫోన్లు ట్యాప్ చేసిందని తీవ్రస్థాయిలో విమర్శలు చేశాయి. పార్లమెంట్ సమావేశాలను కూడా సజావుగా సాగనివ్వకుండా నిరసనలు కొనసాగించాయి. అయితే.. దీన్ని కేంద్రం కొట్టిపారేస్తూ వస్తోంది. కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఎంతకీ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి దీనిపై ప్రశ్నించారు. అదికూడా అంతర్జాతీయ వేదికపై.
Advertisement
బ్రిటన్ టూర్ లో భాగంగా కేంబ్రిడ్జ్ జడ్జి బిజినెస్ స్కూల్ విద్యార్థులకు ‘లెర్నింగ్ టు లిసన్ ఇన్ ది 21వ శతాబ్దం’ అనే అంశంపై ఉపన్యాసం ఇచ్చారు రాహుల్ గాంధీ. ఇండియాలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం గొంతు నొక్కేస్తున్నారని, దాని మౌలిక వ్యవస్థపైనే ఎటాక్ చేస్తున్నారని ఆరోపించారు. తన మీద గూఢచర్యం నిర్వహించడానికి ప్రభుత్వం పెగాసస్ ను వినియోగించిందన్నారు. తన ఫోన్ లోకి పెగాసస్ ని జొప్పించారని, చాలామంది రాజకీయ నేతల ఫోన్లపైనా నిఘా పెట్టారని వివరించారు.
Advertisement
దేశంలో మీడియాను, న్యాయవ్యవస్థను కబ్జా చేసి నియంత్రిస్తున్నారని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఇతరులపై నిఘా, బెదిరింపులు, మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో ప్రభుత్వంపై అసమ్మతిని అణగదొక్కుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమీపంలో పోలీసులు తనను అరెస్టు చేసినప్పటి ఫొటోను ప్రదర్శించారు. ‘పార్లమెంట్ భవనం ఎదుట ప్రతిపక్ష నేతలంతా నిలబడి ఏదో ఒక విషయంపై మాట్లాడినందుకు వారందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారని.. ఇటువంటి ఘటనలు మూడు, నాలుగు సార్లు జరిగాయని అన్నారు. కొన్ని హింసాత్మకంగా కూడా మారుతున్నాయి’ అని రాహుల్ దుయ్యబట్టారు.
ప్రధాని మోడీ భారత ప్రజాస్వామ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని అన్నారు రాహుల్. దీనికి సంబంధించిన పూర్తి ప్రసంగ పాఠాన్ని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం వీడియోగా అప్ లోడ్ చేసింది. మరోవైపు ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. రాహుల్ మైండ్ లో ఇప్పటికీ పెగాసస్ నలుగుతోందని, విదేశీ గడ్డపై ఆయన మళ్ళీ పెడబొబ్బలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీ గురించి ఇటలీ ప్రధాని ఏం మాట్లాడారో రాహుల్ వినాలని సూచిస్తున్నారు.
రాహుల్ గాంధీ యూకేలో వారం రోజుల పాటు పర్యటించనున్నారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో బిగ్ డేటా, ప్రజాస్వామ్యం, భారత్-చైనా సంబంధాలపై నిపుణులతో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటున్నారు.