Advertisement
వైసీపీ ప్రభుత్వాన్ని చిన్న మాట అంటే చాలు.. ముందుగా మీడియా ముందుకొచ్చేస్తారు మాజీ మంత్రి కొడాలి నాని. మంత్రిగా ఉన్న సమయంలో అయితే.. ప్రతీ విషయంలోనూ రియాక్ట్ అయ్యేవారు. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ లను తిట్టడంలో ఈయనది సపరేట్ ల్యాంగ్వేజ్. టీడీపీలో రాజకీయ ఓనమాలు దిద్ది తర్వాత వైసీపీ గూటికి చేరిన కొడాలి.. చంద్రబాబును తరచూ కార్నర్ చేస్తుంటారు. కాస్త కూడా మొహమాటం లేకుండా విమర్శల దాడి చేస్తుంటారు. అయితే.. నాని కొత్త చిక్కుల్లో పడ్డారు.
Advertisement
కొడాలిపై అరెస్టు వారెంట్ జారీ చేయాలని విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు పోలీసులను ఆదేశించడం హాట్ టాపిక్ గా మారింది. నానిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ జనవరి 5వ తేదీ నుంచి పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన వాయిదాలకు ఆయన రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. గవర్నర్ పేట సీఐ సురేష్ కుమార్ ని ప్రశ్నించింది. నానిపై అరెస్టు వారెంట్ పెండింగ్ లో ఉందని, దాన్ని వెంటనే అమలు చేయాలని ఆదేశించింది.
Advertisement
2016లో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అనుకుని తానే చిక్కుల్లో పడ్డారు కొడాలి. అప్పట్లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆందోళనలు చేశారు. పోలీసు ఉత్తర్వులను సైతం ఉల్లంఘించి ఇతర వైసీపీ నేతలతో కలిసి భారీ ర్యాలీ చేపట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు. ఈ కారణంగా ఆయనపై కేసు నమోదైంది. నాని కోర్టుకు హాజరుకాకపోవడంతో న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది.
నిజానికి, వాయిదాలకు హాజరై ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ, నాని ఉద్దేశపూర్వకంగానే గైర్హాజరు అయ్యారని న్యాయస్థానం భావించింది. తమనే లెక్క చేయరా? అంటూ వారెంట్ జారీ అయింది. ఇప్పుడు కొడాలిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిస్తే.. తర్వాత బెయిల్ పై బయటకు వచ్చే ఛాన్స్ ఉంది.