Advertisement
ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తోంది వైసీపీ ప్రభుత్వం. దీనికి దేశంలోని పారిశ్రామిక దిగ్గజాలు హాజరయ్యారు. ఏపీలో తమ పెట్టుబడులపై కీలక ప్రకటనలు చేశారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఓవరాల్ ఒప్పందాలను వివరించారు. రాష్ట్రంలో రూ.13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ఒప్పందాలు జరిగాయని ప్రకటించారు. పారిశ్రామికవేత్తలకు తమ రాష్ట్రం కేవలం ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని అన్నారాయన.
Advertisement
ఈ గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలో పెట్టుబడులకు 340 సంస్థలు ముందుకు వచ్చాయని, దీని ద్వారా 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని వివరించారు. త్వరలోనే విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని, విశాఖ నుంచే పాలన చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈక్రమంలో మంత్రి రోజా స్పందించారు. పెట్టుబడుల విషయంలో ఎప్పటిలాగే జగన్ ను ఆకాశానికెత్తేశారు.
Advertisement
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీకి ఊహించని రీతిలో పెట్టుబడులు రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగినట్లు వివరించారు. పర్యాటక శాఖకు ఈ స్థాయిలో పెట్టుబడులు రావడం ఇదే తొలిసారని సంతోషం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ అంటే ఓ బ్రాండ్.. జగన్ అంటే ఓ జోష్ అని ప్రశంసలు కురిపించారు రోజా. జగన్ పై నమ్మకంతోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాము చేసుకున్నవి నామమాత్ర ఒప్పందాలు కాదని.. అన్నీ క్షేత్రస్థాయిలో పెట్టుబడుల వరకు తీసుకువెళ్తామని అన్నారు.
మరోవైపు ట్విట్టర్ లోనూ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు రోజా. ‘‘ఢిల్లీ వాడు వెక్కిరించినా.. మద్రాస్ వాడు వెళ్లగొట్టినా.. హైదరాబాద్ వాడు గెంటేసినా.. మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నాం. పక్క రాష్ట్రాల రాజధానులకు ధీటుగా మా వైజాగ్ ను తీర్చిదిద్దుతాం–నిజమైన ఆంధ్రోడు’’ అంటూ ట్వీట్ చేశారు.