Advertisement
టీడీపీ నేతల వరుస మరణాలు ఆపార్టీ శ్రేణులను బాధలోకి నెట్టేస్తున్నాయి. ఈమధ్యే సీనియర్ నేత బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. నెల రోజుల క్రితం గుండెపోటుకు గురైన ఆయన విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పార్టీ అధినేత చంద్రబాబు మచిలీపట్నం వెళ్లి.. అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అర్జునుడి పాడె కూడా మోశారు.
Advertisement
మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు.. 1995 నుండి 2000 వరకు ప్రైమరీ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2000 నుండి 2005 వరకు మచిలీపట్టణం మున్సిపాలిటీ ఛైర్మన్ గా పని చేశారు. 2014లో కృష్ణా జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ ఛైర్మన్ గానూ ఉన్నారు. 2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
Advertisement
బచ్చుల మరణ వార్త మరవకముందు మరో కీలక నేత తాజాగా మృతి చెందారు. టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ ఇంచార్జి వరుపుల రాజా గుండెపోటుతో చనిపోయారు. కాకినాడ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అయిదేళ్ల కిందట రాజాకు గుండెపోటు వచ్చింది. అప్పుడు బైపాస్ చేసి స్టంట్ అమర్చారు డాక్టర్లు. వారం రోజులుగా విజయనగరంలో ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రచారం ముగించుకొని శనివారం సాయంత్రం ప్రత్తిపాడు చేరుకున్నారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులతో పలు విషయాలపై మాట్లాడుతుండగా.. ఆయనకు గుండెపోటు వచ్చింది.
రాజా హఠాన్మరం పార్టీకి తీరని లోటు అని అన్నారు చంద్రబాబు. గుండెపోటుతో ఆయన మృతి చెందిన విషయాన్ని తెలుసి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. లోకేష్ స్పందిస్తూ.. ఆత్మీయ స్నేహితుడిని కోల్పోయానని అన్నారు. వరుపుల రాజా ఆకస్మిక మృతి షాక్ కి గురి చేసిందని చెప్పారు. తెలుగుదేశం కుటుంబం యువ నేతను కోల్పోయిందన్న ఆయన.. బాధాతప్త హృదయంతో నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గా, అప్కాబ్ వైస్ ఛైర్మన్ గా సేవలు అందించారు వరుపుల రాజా. 2019 ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ప్రత్తిపాడు టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ గా కొనసాగుతున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా నిత్యం ప్రజలతో మమేకమయ్యేవారని పేరుంది.