Advertisement
బీజేపీ సర్కార్ పై సమరానికి కాలు దువ్వారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఈ క్రమంలోనే ఆమె మహిళా రిజర్వేషన్ బిల్లును అస్త్రంగా మలుచుకుంటున్నారు. దీనికోసం ఢిల్లీలో భారీ ధర్నాకు ప్లాన్ చేశారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు ఆహ్వానాలు పంపారు. చాలామంది నేతలు ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే.. లిక్కర్ స్కామ్ లో కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
Advertisement
ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఒక రోజు దీక్షకు సిద్ధమయ్యారు కవిత. దీనికోసం ఆమె బుధవారమే ఢిల్లీ వెళ్లారు. అయితే.. ఒకరోజు ముందు ఆమెకు షాకిచ్చారు హస్తిన పోలీసులు. జంతర్ మంతర్ లో దీక్షకు అనుమతిని నిరాకరించారు. అయితే.. ఈ విషయాన్ని కవిత మీడియాతో మాట్లాడుతుండగానే చెప్పడం ఇంట్రస్టింగ్ గా మారింది. లిక్కర్ స్కాం, ధర్నా నేపథ్యంలో ఆ వివరాలను మీడియాకు వివరించేందుకు కవిత ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
Advertisement
అయితే.. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే కవితకు పోలీసుల నుంచి మెసేజ్ వచ్చింది. మీ ప్రోగ్రాం కి పర్మిషన్ ఇవ్వలేం. బీజేపీ నేతలు కూడా మరో అంశంపై ధర్నాకు దరఖాస్తు చేసుకున్నారు.. అడిగిన స్థలంలో సగమే ఇస్తామని చెప్పారు. వేరే స్థలం చూసుకోవాలని సూచించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఎలాంటి ఏర్పాట్లు ప్రారంభించలేదు. సంప్రదింపులు జరుపుతున్నామని ధర్నా జరిగి తీరుతుందని కవిత చెబుతున్నారు.
27 ఏళ్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటం చేస్తున్నారని.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆమోదం రాలేదని అన్నారు కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తాము పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. 2014, 2018 ఎన్నికల్లోనూ ఈ బిల్లుపై బీజేపీ హామీ ఇచ్చిందని.. అత్యధిక మంది ఎంపీలు ఉన్నా కూడా దీనిపై దృష్టి సారించడం లేదని మండిపడ్డారు.