Advertisement
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. కాంగ్రెస్ యాంగిల్ లో ఇది డ్రామా అని అంటున్నా.. ఇరు పార్టీల నేతలు మాత్రం మాటల యుద్ధంలో పోటీ పడుతున్నారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఇంకా తమ పార్టీకి చెందిన ఎంతమందిని వేధిస్తారంటూ మీడియా ముందుకొచ్చారు మంత్రి కేటీఆర్. ఇప్పటిదాకా ఐటీ, ఈడీ, సీబీఐ విచారణలు, సోదాలు జరిపిన లిస్టంతా వివరించారు. 12 మంది బీఆర్ఎస్ నేతలను దర్యాప్తు సంస్థల పేరుతో వేధిస్తున్నారని మండిపడ్డారు. అలాగే, దేశవ్యాప్తంగా ఈడీ నమోదు చేసిన వేల కేసులపై వివరిస్తూ.. వాటిలో అతి తక్కువ కేసుల్లోనే నేరం రుజువైందని తెలిపారు.
Advertisement
ఈ సందర్భంగా కేవలం ప్రతిపక్షాలనే కేంద్రం టార్గెట్ చేస్తోందని అన్నారు కేటీఆర్. పైగా, బీజేపీలో చేరిన కరప్షన్ లీడర్లు వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరిగా క్లీన్ ఎలా అవుతారని ఎద్దేవ చేశారు. వేల కోట్ల స్కామ్ కు కారణమైన అదానీ వ్యవహారంలో మోడీ ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మోడీ, అదానీ బంధానికి కొత్త పేరు పెట్టారు కేటీఆర్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఒక ఇంజన్ మోడీ… మరో ఇంజన్ అదానీ అని అభివర్ణించారు.
Advertisement
కర్ణాటకలో ఎమ్మెల్యే కుమారుడు రూ.కోట్లతో దొరికినా వారిపైకి ఈడీ పోదని అన్నారు కేటీఆర్. అదానీపై కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆయనపై శ్రీలంక ఆరోపణలపై మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కవితకు పంపినవి ఈడీ సమన్లు కాదని.. అవి, మోడీ సమన్లని పేర్కొన్నారు. అదానీ మోడీ బినామీ అని ప్రపంచానికి తెలుసని ఆరోపణలు చేశారు. ముంద్రా పోర్టులో రూ.21 వేల కోట్ల మాదకద్రవ్యాలు చర్యలు ఎందుకు లేవని ప్రశ్నించారు.
కేటీఆర్ ప్రశ్నలపై బీజేపీ కూడా అదే రీతిలో రియాక్ట్ అయింది. మంత్రి కేటీఆర్, కవిత వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ సమాజం మొత్తం తలదించుకునే పని చేసిన కవిత.. రాజకీయ వేధింపులు అని మాట్లాడటం సిగ్గు చేటన్నారు. ప్రధాని మోడీ టార్గెట్ చేస్తున్నారని అన్నా చెల్లెళ్లు అంటున్నారని.. ఆయన టార్గెట్ చేసేంత మీరు గొప్ప కుటుంబం, మనుషులు కాదంటూ చురకలు అంటించారు. మీకు మీరుగా కేసులో ఇరుక్కుని బీజేపీపై అభాండాలు వేయడం కరెక్ట్ కాదన్నారు. ఫోన్లు పగలగొట్టింది ఎవరు? ఢిల్లీ లిక్కర్ పాలసీలో తలదూర్చింది ఎవరు? అంతా మార్చింది ఎవరు? స్పెషల్ ఫ్లైట్స్ లో వెళ్లింది ఎవరు? డబ్బులు సంపాదించింది ఎవరు? అంటూ నిలదీశారు కిషన్ రెడ్డి. నోరు తెరిస్తే అబద్ధాలు.. నిజం మాట్లాడమే తెలియదు అంటూ విరుచుకుపడ్డారు.