Advertisement
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంతమాత్రమే. ప్రత్యేక రాష్ట్రం దెబ్బతో అక్కడ కనుమరుగు అయిపోయింది ఈ పార్టీ. ముఖ్య నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ కావడంతో కార్యక్రమాలు కూడా సైలెంట్ గా సాగుతున్నాయి. అయితే.. తిరిగి పుంజుకుంటామని ఉన్న కొంతమంది లీడర్లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ సీనియర్ నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి షాక్ ఇచ్చారు.
Advertisement
కాంగ్రెస్ కు ఆయన రాజీనామా చేశారు. దీనికి సంబంధించిన లేఖను ఏఐసీసీ అధ్యక్షునికి పంపించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు నల్లారి. ఈయన బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. అమిత్ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ పెద్దలతో సంప్రదింపులు అయిపోయాయని సమాచారం. బీజేపీలో చేరాలని డిసైడ్ అయ్యాకే నల్లారి కాంగ్రెస్ కు రాజీనామా చేశారని అంటున్నారు.
Advertisement
కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా పనిచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది కీలక నేతలతో ఈయనకు మంచి సంబంధాలు వున్నాయి. ఈ క్రమంలో ఆయన చేరిక పార్టీకి లాభం చేకూరుస్తుందని బీజేపీ అధిష్టానం ఆలోచనలో వున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమధ్యే బలమైన నేత కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో ఆయన ప్లేస్ ను నల్లారి భర్తీ చేస్తారని కమలనాథులు భావిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి చిత్తూరు జిల్లాకు చెందిన నేత. పీలేరు నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు స్పీకర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. వైఎస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్యను ముఖ్యమంత్రి చేయగా.. ఆయన కొన్ని రోజుల్లోనే తప్పుకున్నారు. దీంతో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన వరకు ఆ పదవిలో ఆయనే కొనసాగారు. ఎన్నికలయ్యాక మళ్లీ ఎక్కడా కనిపించలేదు.