Advertisement
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇంటా బయటా.. ఆయనపై విమర్శల దాడి జరుగుతోంది. ఈమధ్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. అయితే.. అవినీతికి పాల్పడితే అరెస్ట్ చేయకుండా ముద్దు పెడతారా? అంటూ ఆయన కవితను ఉద్దేశించి అన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. బీఆర్ఎస్ ఈ విషయాన్ని బాగా క్యాష్ చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, దిష్టిబొమ్మ దహనాలు ఇలా చాలానే చేసింది.
Advertisement
కొందరు బీఆర్ఎస్ నేతలు అయితే.. బండి సంజయ్ ని పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ ను వినిపించారు. కవితపై బండి చేసిన వ్యాఖ్యల్ని ఇతర పార్టీల నేతలు కూడా ఖండిస్తున్నారు. అలా మాట్లాడి ఉండకూడదని హితవు పలుకుతున్నారు. అయితే.. సొంత పార్టీ నేతలు ఒక్కొక్కరుగా బండికి వ్యతిరేకంగా స్వరం పెంచుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా సంజయ్ పై తోటి ఎంపీ ధర్మపురి అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. కవితపై చేసిన వ్యాఖ్యలను తాను సమర్ధించనని, బండి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. సామెతలను ఉపయోగించే సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హోదా అంటే పవర్ సెంటర్ కాదని.. అది అందరినీ సమన్వయం చేసే బాధ్యత అంటూ గుర్తు చేశారు.
Advertisement
అరవింద్ వ్యాఖ్యలపై చర్చ జరుగుతుండగానే.. పార్టీ సీనియర్ నేత పేరాల శేఖర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘మిత్రులు, అభిమానులకు నమస్కారం.. ధర్మపురి మాట్లాడింది వంద శాతం కరెక్ట్. కిషన్ రెడ్డి గారో, లక్ష్మణ్ గారో, ఇతర పెద్దలు చేయాల్సిన పని ఆయన చేశారు. అధ్యక్షుని పరిణతి లేని అసందర్భ మాటలు, వ్యవహారం, నియంతృత్వం, అప్రజాస్వామిక చేష్టలు బీజేపీలో ఈ పరిస్థితికి కారణం.. అన్ని మసీదుల తవ్వకాలు, ముద్దులు పెట్టడాలు, బ్లాక్మెయిల్, ఇష్యూస్ లేవదీసి అంతర్గతంగా సెటిల్మెంట్స్, సుదీర్ఘ కాలంగా ఉన్న కార్యకర్తలకు అవమానం, ఒంటెద్దు పోకడలు, సమన్వయ లోపం, వ్యక్తిగత ఆర్థిక స్వార్థం, యూస్ అండ్ త్రో.. ఇవన్నీ మన పార్టీ సంస్కృతి కాదు. అయినా యథేచ్ఛగా నడుస్తున్నాయి. వీటన్నింటినీ ఉదాహరణలతో సహా నిరూపించడానికి నేను సిద్ధం. పార్టీలో వినే సంస్కృతి, చర్చించే పద్ధతి మాయమైనప్పుడు సోషల్ మీడియానే ఆధారమవుతుంది. ప్రస్తుతం మన పార్టీ పరిస్థితి 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి లాగా ఉంది. దీనికి కారణం రాష్ట్ర నాయకత్వం స్వయంకృతాపరాధాలే. కేసీఆర్ బీఆర్ఎస్ పతనం అవుతున్న ఈ సమయంలో, ఇదంతా జరగడం మన దురదృష్టం. కేంద్ర పార్టీ పెద్దఎత్తున మద్దతు ఇస్తున్నా ఉపయోగించుకోలేకపోతున్నాం’’ అని వ్యాఖ్యానించారు శేఖర్ రావు.
అంరవింద్, పేరాల దారిలోనే బండి సంజయ్ తీరుపై మరో సీనియర్ నేత కన్నం అంజయ్య సంచలన కామెంట్స్ చేశారు. దళితులపై ఆయన వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తున్నారని ఫైరయ్యారు. దేశం కోసం-ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలను మెచ్చుకోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. కోర్ కమిటీలో దళితులకు పదవుల విషయంలో ప్రశ్నించిన అంజయ్య.. బీసీ నాయకుడిగా ఉండి, దళితులకు పదవులు ఇవ్వకుండా ఉండటమేంటని నిలదీశారు. భారతీయ జనతా పార్టీలో తమ స్థానం ఏంటని కార్యకర్తలు అడుగుతున్నారని, ఏమని చెప్పాలని ప్రశ్నించారు. ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్లకే బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు.
ఇవన్నీ ధర్మపురి, పేరాల, అంజయ్య మాటలే కాదు. ఆ పార్టీలో బయటికి అనలేక లోలోపల కుమిలిపోతున్నవారు అనేక మంది ఉన్నారని బీజేపీ వర్గాలే వాపోతున్నాయి. బండి సంజయ్ వ్యవహార శైలి, మాట తీరు పార్టీని నాశనం చేస్తున్నదని, నిజాయితీగా ఎంతో కాలం నుంచి పార్టీ కోసం పని చేసిన వారు ఆయన వల్ల దూరమవుతున్నారని బీజేపీ నాయకులు ఆవేదన చెందుతున్నారట. ఆయన తీరువల్ల అనేక మంది సీనియర్ నేతలు మాట్లాడటమే మానేశారని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.