Advertisement
ఢిల్లీ లిక్కర్ స్కాంలో వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రెండు పెద్ద పరిణామాలు జరిగాయి. ఒకటి.. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డిని ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరోసారి విచారించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులలో ఈ నెల 28వ తేదీ వరకు రాఘవ రెడ్డి కస్టడీని పొడిగిస్తున్నట్లు పేర్కొంది. కేసుకు సంబంధించిన దర్యాప్తులో పురోగతి ఉందని తెలిపింది.
Advertisement
ఇక రెండోది.. కవిత పిటిషన్ కు సంబంధించి ఈడీ సుప్రీంకోర్టులో శనివారం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కవిత పిటిషన్ పై తమ వాదనలు కూడా వినాలని కోరింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిబంధనలకు విరుద్ధంగా అంతా సాగుతోందని.. ఒక మహిళను ఈడీ ఆఫీసులో విచారించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారామె. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 24న విచారణ జరగనుంది.
Advertisement
అయితే.. ఈడీ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఏ నిర్ణయాలు వెల్లడించరాదని కోరింది. ఈడీ కేవియట్ పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కవిత తరుఫు న్యాయవాదితో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాతే తీర్పు వెలువరించనుంది.
ఈడీ కేసులో ఈనెల 11న విచారణ ఎదుర్కొన్న కవితను.. 16న మరోసారి రావాలని ఆదేశించారు అధికారులు. కానీ, విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేశారు. దీనిని సాకుగా చూపుతూ.. 16న విచారణకు వెళ్లలేదు. అయితే.. 20న విచారణకు రావాలని మరోసారి ఆమెకు నోటీసులు ఇచ్చారు అధికారులు.