Advertisement
Ap Assembly Session Updates: ఏపీ అసెంబ్లీలో ఎలాంటి మార్పు లేదు. అవే నిరసనలు.. అవే సస్పెన్షన్లు.. కాకపోతే ఎమ్మెల్యేలు కాస్త దూకుడు పెంచారు. కొట్టుకునే వరకు వెళ్లారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన దగ్గర నుంచి టీడీపీ సభ్యులు ఏదో ఒక అంశంపై నిరసన వ్యక్తం చేయడం.. స్పీకర్ వారిని సస్పెండ్ చేయడం కామన్ గా జరుగుతూ వస్తోంది. సోమవారం కూడా అదే సీన్ రిపీట్ అయింది. సభ ప్రారంభమైన కాసేపటికే ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Advertisement
జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చింది టీడీపీ. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది. జీవో నంబర్ 1ను రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు టీడీపీ సభ్యులు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలో బైఠాయించిన ఆందోళన వ్యక్తం చేశారు. స్పీకర్ దగ్గర ప్లకార్డులను ప్రదర్శించారు.. అయితే, ఈక్రమంలోనే ఘర్షణ మొదలైంది.
Advertisement
స్పీకర్ ముఖంపై ప్లకార్డును పెట్టారు టీడీపీ ఎమ్మెల్యే డోలా.. స్పీకర్ తమ్మినేని దానిని పక్కకు తోశారు.. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్యే.. స్పీకర్ తో దురుసుగా ప్రవర్తించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడకు వెళ్లారు. సుధాకర్ బాబు సహా మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పోడయం దగ్గరకు వెళ్లగా.. అక్కడే.. ఇరు పార్టీల సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
పరస్పరం టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు విసురుకున్నారు. తమ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు అంటుంటే.. తనపైనే దాడి జరిగిందని సుధాకర్ గాయాన్ని చూపిస్తున్నారు. 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అయినా, వారు బయటకు వెళ్లకపోవడంతో మార్షల్స్ తో బయటకు పంపించారు.
అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ ఆపార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. అసెంబ్లీ చరిత్రలోనే ఈ రోజు చీకటి రోజని దుయ్యబట్టారు. సభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ జరగలేదని.. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్భలంతోనే దళిత సభ్యుడు స్వామిపై దాడి చేశారని మండిపడ్డారు. చట్టసభకు మచ్చ తెచ్చిన వ్యక్తిగా సీఎం జగన్ కచ్చితంగా నిలిచిపోతారని అన్నారు చంద్రబాబు.