Advertisement
లిక్కర్ స్కాం కేసు.. అటు ఢిల్లీలో, ఇటు తెలంగాణ ప్రకంపనలు రేపుతోంది. అక్కడి అధికారంలోని ఆప్ కి, ఇక్కడి అధికారంలోని బీఆర్ఎస్ కు పెద్ద తలనొప్పిగా తయారైంది ఈకేసు. కేంద్ర దర్యాప్తు సంస్థలు దేన్నీ వదలకుండా.. నోటీసులు, విచారణ అంటూ హడావుడి చేస్తున్నారు. సోమవారం ఈ కేసులో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Advertisement
కేసుకు సంబంధించి వివరాలు రాబట్టేందుకు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు రెండోసారి విచారించారు. సుదీర్ఘంగా 10 గంటలకు పైగా ఆమె విచారణ కొనసాగింది. సిసోడియా, పిళ్లైతో కలిపి కవితను ఈడీ విచారించినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, ఢిల్లీ మీటింగ్, వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగినట్టు వార్తలు వస్తున్నాయి. మంగళవారం మరోసారి విచారణ ఉంటుందని కవితకు నోటీసులు పంపారు అధికారులు.
మనీష్ సిసోడియా కస్టడీని ఏప్రిల్ 3 వరకు పొడిగించింది న్యాయస్థానం. తదుపరి విచారణకు వర్చువల్ గా హాజరుకావాలనుకుంటే.. దరఖాస్తు దాఖలు చయాలని కోరింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణల నేపథ్యంలో సీబీఐ, ఈడీ ఆయనను విచారిస్తున్నాయి. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో ఉన్న ఆయనను కోర్టు ముందు హాజరుపరిచింది. దర్యాప్తు పెండింగ్ లో ఉన్నందన కస్టడీని సీబీఐ కోరడంతో పొడిగించింది కోర్టు.
Advertisement
ఇదే కేసులో అరెస్టైన అరుణ్ రామచంద్ర పిళ్లైకి స్పెషల్ కోర్టు 14 రోజుల పాటు జ్యూడీషియల్ కస్టడీని విధించింది. సోమవారంతో కస్టడీ ముగియయడంతో అధికారులు స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు. ఏప్రిల్ 3వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధించింది న్యాయస్థానం. అలాగే కస్టడీలో ఉన్నన్ని రోజులు పిళ్లైకు అవసరమైన మందులు సమకూర్చాలని ఆయన తరఫు న్యాయవాదులు కోరగా అందుకు అంగీకరించింది.
ఇక జైల్లో ఉన్న అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దానిని న్యాయస్థానం నిరాకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అభిషేక్ బోయినపల్లి.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. పిల్లల స్కూల్ అడ్మిషన్ కోసం హాజరు కావాల్సి ఉందని.. బెయిల్ ఇవ్వాలని కోరారు. స్కూల్ లో పిల్లల అడ్మిషన్ కోసం నేరుగా హాజరు కావాల్సి ఉందని.. వారి భవిష్యత్, చదువులను దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ లో స్పష్టం చేశారు బోయినపల్లి. కానీ, న్యాయస్థానం ఒప్పుకోలేదు.
లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మంగళవారం విచారణకు హాజరుకావాలని ఇచ్చింది. 18న ఈడీ విచారణకు ఆయన గైర్హాజరు అయ్యారు. దీంతో ఈడీ మరోసారి నోటీసులు పంపింది. ఇప్పటికే ఎంపీ కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసింది. సౌత్ గ్రూపులో కీలకంగా ఉన్న వ్యక్తుల్లో మాగుంట ఒకరని ఈడీ అభియోగాలు మోపింది.