Advertisement
పేపర్ లీకేజ్ అంశం.. తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు సిట్ ఇన్వెస్టిగేషన్ సాగుతుంటే ఇంకోవైపు రాజకీయంగా ఈ ఇష్యూ దుమారం రేపుతోంది. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా కేటీఆర్ పాత్ర ఉందని గట్టిగా నొక్కి చెబుతున్నారు. పేపర్ లీక్ ల ఇష్యూని క్యాష్ చేసుకుంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే.. సిట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.
Advertisement
పేపర్ లీకేజ్ కేసులో నాయకులు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది సిట్. వారి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు తెలియజేయాలని నోటీసుల్లో కోరింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు మరికొందరు రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ల లీక్ పై రేవంత్ రెడ్డి వద్ద ఉన్న సమాచారాన్ని తమకు ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. రేవంత్ ను ఈనెల 23న 11 గంటలకు తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సిట్ కార్యాలయానికి రావాలని సూచించింది.
Advertisement
కేటీఆర్ పీఏ సొంత మండలంలో గ్రూప్ 1 పరీక్ష రాసిన వారిలో చాలామందికి 100కు పైగా మార్కులు వచ్చాయని వ్యాఖ్యలు చేశారు రేవంత్. ఇది అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఈ కామెంట్స్ సిట్ దృష్టికి వెళ్లాయి. ఎవరెవరికి వందకు పైగా మార్కులు వచ్చాయి? ఆ మార్కులు పొందిన వారు ఎవరు? అనే వివరాలు సమర్పించాలని సిట్ నుంచి రేవంత్ రెడ్డికి నోటీసులు వెళ్లాయి. రేవంత్ ఇంటి దగ్గర లేకపోవడంతో గోడకు నోటీసులను అంటించారు అధికారులు.
సిట్ నోటీసులపై స్పందించారు రేవంత్. నోటీసులకు భయపడేది లేదని అన్నారు. తమ దగ్గర ఉన్న ఆధారాలు సిట్ కు ఇవ్వమని, సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపితేనే ఇస్తామని పేర్కొన్నారు. ఈ కేసును కావాలనే నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రాలు సంతలో సరుకులుగా మారాయని అన్నారు. ప్రభుత్వం తన తప్పులు కప్పిపుచుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఐటీ శాఖకు అసలు ఏమాత్రం సంబంధం లేదని కేటీఆర్ అంటున్నారని చెప్పారు.
లీకేజీని తామే బయటపెట్టామని మంత్రి గంగుల చెప్పుకుంటున్నారని.. ఇది కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ సంబంధించిందేనని మరోసారి ఆరోపణలు చేశారు. అయితే.. రేవంత్ ప్రస్తుతం హాత్ సే హాత్ జోడో యాత్ర చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 23న తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో సిట్ కార్యాలయానికి రేవంత్ వెళ్తారా? లేదా? అనేది సస్పెన్స్ గా మారింది. ఆయన మాత్రం ఆధారాలు ఇవ్వననే చెబుతున్నారు. కానీ, విచారణపై క్లారిటీ ఇవ్వడం లేదు.