Advertisement
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా రాజకీయ పార్టీల ఆఫీసుల్లో సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో రాష్ట్రానికి అన్నీ శుభాలే జరగాలని ఆకాంక్షించారు.
Advertisement
వైసీపీ అరాచకాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చిన చంద్రబాబు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టారన్నారు. పదవుల్లో శాశ్వతంగా ఉండడానికి ఇది రాజరికం కాదని.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతూనే ఉంటామని తెలిపారు. తెలుగు జాతి అనేక రంగాల్లో రాణిస్తోందన్న ఆయన.. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారి కోసం పనిచేయడం టీడీపీ బాధ్యత అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా తెలుగోడు రాణిస్తున్నాడని ఈ సందర్భంగా కొనియాడారు చంద్రబాబు.
Advertisement
వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రం నాలుగేళ్లు కష్టాల్లోనే ఉందని.. ఈ ఏడాది నుంచి ఏపీ ప్రజల జీవితాల్లో వెలుగులు రావడం ఖాయమని తెలిపారు. నిత్యావసర ధరలు, పన్నులు పెరిగి ప్రజలపై మోయలేని భారం పడిందన్న బాబు.. వైసీపీ పాలనలో ప్రశ్నించిన వారిపై దాడులు పెరిగిపోతున్నాయని విమర్శించారు. గత 40 ఏళ్లలో ఎన్నడూ చూడని అరాచకాలు ఈ నాలుగేళ్లలో చూశానన్నారు.
ఇక తాడేపల్లిలో సీఎం జగన్ నివాసంలో ఉగాది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సతీసమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు జగన్. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. అనంతరం కప్పగంతు సుబ్బరాయ సోమయాజులతో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరిగింది. జగన్ దంపతులు పంచాంగ శ్రవణాన్ని విన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పిన జగన్.. ఏడాదంతా ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకున్నారు.