Advertisement
క్యూ న్యూస్ మల్లన్న అరెస్ట్ మిస్టరీ వీడింది. మంగళవారం రాత్రి నుంచి అతని అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగుతుండగా.. ఎట్టకేలకు పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. 14 రోజుల రిమాండ్ విధించగా.. చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు.
Advertisement
అసలేం జరిగింది?
మంగళవారం (మార్చి 21) రాత్రి 20 మంది పోలీసులు ఫిర్జాదిగుడలోని క్యూ న్యూస్ ఆఫీస్ లో సోదాలు జరిపారు. కొన్ని కీలక హార్డ్ డిస్క్ లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మల్లన్నను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. సాయి కరణ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేసినట్టుగా ఎఫ్ఐఆర్ ద్వారా వెల్లడైంది.
Advertisement
మల్లన్నతో పాటు మరో నలుగురిని మేడిపల్లి పోలీసులు.. హయత్ నగర్ మునగనూరులోని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మల్లన్నతో పాటు మరికొందరికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మల్లన్నపై నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడంతో.. పెట్టిన సెక్షన్ల వివరాలు అందరికీ తెలిశాయి. సాయి కరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో 148, 307, 342, 506, 384, 109, ఆర్/డబ్ల్యూ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మల్లన్న అరెస్ట్ పై సస్పెన్స్ కొనసాగింది. బుధవారం మధ్యాహ్నం దాకా అంతా గోప్యంగా ఉంచారు పోలీసులు. దీంతో అతని భార్య మమత మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లింది. తన భర్త ఎక్కడున్నాడో చెప్పాలని నిలదీసింది. అయితే.. మల్లన్నను రిమాండ్ కు తరలించారని తెలిసి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది మమత. పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని.. ప్రభుత్వం ప్రజా గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించింది. ఉదయం నుంచి పోలీసులు మల్లన్నను పలు పోలీస్ స్టేషన్లకు తరలించారని.. తనను కలవనివ్వలేదని తెలిపింది. మల్లన్న రిమాండ్ పై గురువారం ఎల్బీనగర్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పింది.