Advertisement
ప్రధాని నరేంద్ర మోడీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రోడ్లు, రైల్వే విస్తరణ పనులు, చేనేత కార్మికుల సమస్యలపై వివరంగా ప్రధానికి వివరించారు. హైదరాబాద్ మెట్రో రైలును ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు విస్తరించాలని ముందు నుంచి కోమటిరెడ్డి కోరుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా మోడీకి వివరించారు. దీనికోసం ఉన్నత స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అవగాహన కల్పించారు.
Advertisement
ఎంఎంటీఎస్ ఫేజ్-2 ప్రాజెక్టును ఘట్ కేసర్ నుంచి ఆలేరు, జనగాం వరకు విస్తరించాలన్నారు వెంకట్ రెడ్డి. నిత్యం హైదరాబాద్ కు ఆ రూట్ లో జరుగుతున్న ప్రయాణాల గురించి వివరించారు. వందల మంది హైదరాబాద్ నగరానికి తమ పనుల కోసం రోజూ వెళ్లి వస్తుంటారని.. రద్దీ దృష్ట్యా ఎంఎంటీఎస్ విస్తరణ అవసరమని తెలిపారు. అలాగే, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని 6 లేన్లుగా విస్తరించాలని మోడీని కోరారు కోమటిరెడ్డి. పెరిగిన రద్దీ గురించి, జరుగుతున్న ప్రమాదాల గురించి వివరించి చెప్పారు.
తన నియోజకవర్గంలోని చేనేత కార్మికులు పడుతున్న కష్టాలపై మోడీకి వివరించారు ఎంపీ. 18 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఉన్న చేనేత కార్మిక కుటుంబాలను ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన, ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకాల పరిధిలోకి తీసుకురావాలని విన్నవించారు. చేనేత కార్మికులు సాంకేతికత విషయంలో సవాళ్లను ఎదుర్కొంటున్నారని.. డిజైన్ అభివృద్ధి, మార్కెట్ ట్రెండ్ లకు అనుగుణంగా, ఆధునిక యంత్రాల సౌకర్యాలు లేవని తెలిపారు. వాటిపై దృష్టి పెట్టి సమకూర్చాలని మోడీని కోరారు.
Advertisement
హెచ్‌ఎస్‌ఎస్ పథకం కింద తెలంగాణకు కేవలం 20 ఆసు యంత్రాలను మాత్రమే కేటాయించారని.. అవి సరిపోవని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు కోమటిరెడ్డి. కనీసం 500 ఆసు యంత్రాలను ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద బ్లాక్ లెవెల్ క్లస్టర్ మంజూరు చేయాలని కోరారు. అలాగే, భువనగిరి పార్లమెంట్ స్థానం పరిధిలోని రహదారుల పునరుద్ధరణ గురించి చర్చించారు. మూసీనది ఆయకట్టు ప్రాంతం కింద ఉన్న గ్రామాల రోడ్ల అనుసంధానం, కొత్త రహదారుల నిర్మాణం అవసరంపై వివరించారు.
ప్రధానితో భేటీ తర్వాత.. మీడియాతో మాట్లాడారు వెంకట్ రెడ్డి. తాను అభివృద్ధిని కాంక్షించే వ్యక్తిని కాబట్టే ప్రధాని వద్దకు వెళ్లి పలు సమస్యలను ప్రస్తావించినట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలతో పంట నష్టంపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్లానని.. నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు కేంద్రం తరఫున ఓ టీమ్ ను పంపుతామని ప్రధాని చెప్పినట్లు తెలిపారు. తాను కోరిన వాటికి ప్రధాని మోడీ చాలా సానుకూలంగా స్పందించారని చెప్పారు. ముఖ్యమైన పనులు మంజూరై ఒకటి రెండు నెలల్లో ప్రారంభిస్తారని తాను నమ్ముతున్నాన్నారు. తాను ఎంపీగా నియోజకవర్గ అంశాల గురించి మాత్రమే చర్చించానని చెప్పారు వెంకట్ రెడ్డి. ప్రధాని హోదాలో అధికారులతో పాటు ఆయన ఉన్నప్పుడు రాజకీయాల గురించి ఎలా మాట్లాడగలమని.. తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చ అన్నదే రాలేదని స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీ మీద మీడియా అడిగిన ప్రశ్నలకు ఢిల్లీ విషయాలు ఢిల్లీలోనే మాట్లాడతానని.. పేపర్ లీకేజీ అంశంపై హైదరాబాద్ లో స్పందిస్తానన్నారు.