Advertisement
పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలారు. కోర్టు ఆయనకు రెండేళ్ల శిక్ష కూడా విధించింది. అయితే.. వెంటనే బెయిల్ ఇచ్చి 30 అప్పీలు కోసం 30 రోజుల గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవి కోల్పోతారనే ప్రచారం ఊపందుకుంది. అసలు, చట్టాలు ఏం చెబుతున్నాయి. రాజకీయ నాయుడు కేసుల్లో దోషి అని తేలితే ఏం జరుగుతుంది? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి వస్తుండగా.. నిపుణులు వివరిస్తున్నారు.
Advertisement
మనదేశ చట్టాల ప్రకారం.. ఏదైనా నేరానికి రెండేళ్ల శిక్ష పడితే.. ఆ రాజకీయ నేత అనర్హతకు గురవుతారు. కోర్టు తీర్పు వచ్చిన క్షణం నుంచే అతను అనర్హుడు అవుతారు. 1951 ప్రజాప్రతినిధుల చట్టంలోని నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దోషిగా తేలిన లీడర్ పై అనర్హత వేటు వేసే ముందు గతంలో మూడు నెలల సమయం ఇచ్చేవారు. ఆలోపు పై కోర్టులలో అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. న్యాయపరమైన అవకాశాలన్నీ వినియోగించుకునే వరకు వారిపై వేటు పడదు.
అయితే.. లిలీ థామస్ అనే న్యాయవాది ఈ నిబంధనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పోరాటం సాగించారు. ఆ నిబంధన రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. 2013లో ఆ రూల్ ను కొట్టివేసింది. ఎవరైనా ప్రజాప్రతినిధి దోషిగా తేలిన వెంటనే అనర్హుడిగా పరిగణించాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పు ప్రకారం చూసుకుంటే.. రాహుల్ గాంధీపై అనర్హత కత్తి వేలాడుతున్నట్టే.
Advertisement
సాంకేతికంగా చూస్తే 1951 నాటి చట్టంలో సెక్షన్ 8 (3) ప్రకారం.. దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల పట్ల ఏ సభ్యుడైనా అసంతృప్తి ప్రకటించినప్పుడు ఆ ఉత్తర్వులను సవాలు చేస్తూ పై కోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ కేసులో ఆయన హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళవచ్చు. పై కోర్టు కింది కోర్టు ఇచ్చిన రూలింగ్ కి భిన్నంగా ఉత్తర్వులు ఇస్తే రాహుల్ లోక్ సభ సభ్యత్వానికి ముప్పు ఉండదు. పైగా ఆయనకు సూరత్ కోర్టు 30 రోజుల సమయం ఇచ్చింది గనుక ఈ సమయంలో పైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకోవచ్చు.
ప్రస్తుతం కేరళలోని వయనాడ్ లోక్ సభ నియోజకవర్గానికి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయనపై అనర్హత వేస్తూ లోక్సభ స్పీకర్ ఓంబిర్లా అధికారిక ప్రకటన చేస్తే.. ఆయన తన సభ్యత్వాన్ని కోల్పోతారు. వయనాడ్ స్థానం ఖాళీ అయిపోతుంది. ఉపఎన్నిక అనివార్యమౌతుంది.
2019 ఎన్నికలకు ముందు ప్రచారంలో మోడీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోడీయే ఎందుకంటూ వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకెక్కి.. పరువునష్టం కేసు వేశారు. దీనిపై తాజాగా సూరత్ కోర్టు రాహుల్ ను దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష విధించింది. తీర్పు వెలువడే ముందు కోర్టు ఎదుట హాజరైన రాహుల్.. తన ఉద్దేశం సరైందేనని, దురుద్దేశంతో తాను మోడీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. ఆయన తరఫున వాదించిన న్యాయవాది జిగ్నేష్.. తన క్లయింట్ ను సమర్థించుకుంటూ ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.