Advertisement
రాహుల్ గాంధీపై అనర్హత అప్రజాస్వామికమన్నారు భువనగరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కేంద్ర నిరంకుశ చర్యలను నిరసిస్తూ గాంధీభవన్ లో చేపట్టిన ‘సంకల్ప్ సత్యాగ్రహ’ దీక్షలో ఆయన పాల్గొన్నారు. రాహుల్ గాంధీపై అనర్హత ప్రకటించడం అన్యాయం, అక్రమమన్నారు. ప్రజల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జోడో యాత్ర చేశారని.. దేశం ఐక్యంగా ఉండాలని చెప్పారని తెలిపారు. ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చినా వద్దన్నారని.. అలాంటి వ్యక్తిపై బీజేపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.
Advertisement
అదానీ అంశం గురించి రాహుల్ గాంధీ ఎప్పుడైతే మాట్లాడారో అప్పటినుంచి కుట్రకు ప్లాన్ మొదలైందన్నారు కోమటిరెడ్డి. అదానీ గురించి అంతా బయటపెడతారని ఈ ఇష్యూని డైవర్ట్ చేసేందుకు అనర్హత అంశాన్ని తెరపైకి తెచ్చారన్నారు. కింది కోర్టు పైకోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఇచ్చిందని.. కానీ, ఆఘమేఘాల మీద డిస్ క్వాలిఫై చేయించారని ఆరోపించారు. అదానీ అంశంపై రాహుల్ మళ్లీ మాట్లాడితే బీజేపీ పని అయిపోతుందనే భయంతో కుట్ర చేశారన్నారు.
Advertisement
రాహుల్ గాంధీకి అండగా మేమంతా పోరాటం చేస్తామన్న వెంకట్ రెడ్డి.. పార్టీ పెద్దలు అంగీకరిస్తే ఎంపీలందరూ రాజీనామా చేస్తామని తెలిపారు. బీజేపీ కుట్రలు ప్రపంచం మొత్తం తెలియాలని.. రాహుల్ గాంధీ ఆపార్టీ బండారం మొత్తం బయట పెడుతున్నారనే సభ్యత్వాన్ని రద్దు చేయించారన్నారు. బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. ఏం చేసినా నడుస్తుందనే భావనలో వారు ఉన్నారని.. ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుంటూ రాహుల్ వెన్నంటే అందరూ ఉండాలని కోరారు.
‘‘దేశాన్ని కుల, మతాలుగా విడగొడుతున్నారు.. దీనిపై రాహుల్ గాంధీ తిరగబడుతున్నారు. అందర్నీ ఐక్యంగా ఉంచేందుకు చూస్తున్నారు. అనర్హత నిర్ణయాన్ని నిరసిస్తూ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధర్నాలు నిర్వహించాం. మోడీ దిష్టిబొమ్మలను దహనం చేశాం. అదానీ లాంటి కుంభకోణం ఎక్కడా లేదు.. బీజేపీకి బుద్ధి చెప్పాలి. నేను, రేవంత్, ఉత్తమ్ పోరాటం చేయకుండా ఉండి ఉంటే.. సింగరేణి పేరుతో 40వేల కోట్లు దోచుకునేవారు. టెండర్ విషయంలో పోరాటం చేశాం. పార్లమెంట్ లో కొట్లాడాం. ఎంతోమందికి లేఖలు రాశాం. అదానీ, ప్రతీమ శ్రీనివాస్ కుంభకోణాన్ని ఆపాం. అవినీతి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ.. ఐక్యంగా ఉండి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువద్దాం’’ అని ప్రసంగించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.