Advertisement
రుణమాఫీ చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇంతవరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పొల్కంపల్లి గ్రామంలో మర్రి నిరంజన్ రెడ్డి నిర్వహించిన యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యోగాలు అదిగో ఇదిగో అంటూ ఎనిమిదిన్నరేళ్లు మాయ చేశారని అన్నారు. నిరుద్యోగులు ఎంతో కష్టపడి గ్రూప్స్ పరీక్షలు రాస్తే.. ప్రశ్నాపత్రం లీకేజ్ తో వారిని అయోమయంలోకి నెట్టారని మండిపడ్డారు.
Advertisement
అధికార పార్టీకి చెందినవాళ్లే పేపర్ లీకేజ్ చేశారన్న కోమటిరెడ్డి.. ఒక్కో పేపర్ 10 లక్షలకు అమ్ముకున్నారని ఆరోపించారు. దీనివల్ల నిరుద్యోగులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేసీఆర్ కు విద్యార్థుల పరీక్షలు నిర్వహించడం రాదు.. ఉద్యోగ పరీక్షలు నిర్వహించడం రాదు.. రైతు రుణమాఫీ చేయడం రాదు.. ఏం చేశారు ఆఖరికి.. బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి.. పిల్లలు చచ్చేలా చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అంటూ ఫైరయ్యారు.
Advertisement
తెలంగాణలో కేసీఆర్ కుటుంబమే బంగారుమయమైందన్న వెంకట్ రెడ్డి.. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బంగారు మైన్స్ లో పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ కుటుంబం, మంచిరెడ్డి కుటుంబాలు బంగారుమయం అయ్యాయని సెటైర్లు వేశారు. అందుకే, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి కోసం ప్రధానితో కొట్లాడి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నానని తెలిపారు.
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నా పదవికి రాజీనామా చేశా.. యువకుల బలిదానాలు చూసి తట్టుకోలేకపోయా.. ఆనాడు సోనియా గాంధీతో చెప్పా.. మా పిల్లలు చచ్చిపోతున్నారు తెలంగాణ ఇవ్వమని అడిగా. నేను పదవుల కోసం ఆలోచించే వ్యక్తిని కాదు.. ప్రజల కోసం కష్టపడే వాడిని.. ఆనాడు రాజశేఖర్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే.. దాన్నితెలంగాణ కోసం వదిలేశా. ఉన్నన్నాళ్లూ మంచి పనులు చేయాలి.. ఐదేళ్లు ఎమ్మెల్యేగా చేయడం కాదు.. ప్రజల హృదయాల్లో గుర్తుండిపోవాలి. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా చేశాను.. ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణను బాగు చేసుకోవాలన్నదే నా కోరిక. ప్రజలు ఆపదలో ఉంటే.. నేనున్నానని మర్చిపోవద్దు’’ అని చెప్పారు వెంకట్ రెడ్డి.
ప్రభుత్వం చెబుతున్న ఫార్మాసిటీ అవసరం లేదని.. ఇప్పటికే అనేక గ్రామాలు కాలుష్యకొరల్లో చిక్కుకున్నాయని వివరించారు. ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి.. ఫార్మా కంపెనీలొస్తే రోగాలు వస్తాయి అని అన్నారు. మన భూములు 4, 5 లక్షలకు తీసుకుని కేసీఆర్ 2 కోట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఉన్నవారికే టికెట్ ఇస్తామని.. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.