Advertisement
వరుసగా మూడోసారి గెలిచి సత్తా చాటాలనేది కేసీఆర్ కల. దానికి తగట్టే కార్యాచరణ కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆత్మీయ సమావేశాలకు శ్రీకారం చుట్టింది బీఆర్ఎస్. ప్రతీ నియోజకవర్గంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సిరిసిల్ల టూర్ లో భాగంగా మంత్రి కేటీఆర్ సమావేశంలో పాల్గొని బీఆర్ఎస్ శ్రేణుల టార్గెట్ ఏంటో చెప్పేశారు.
Advertisement
ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ పంచాయతీ అంటే గంగదేవిపల్లి, అంకపూర్ మాత్రమే ఉండేవని.. కానీ, ఇప్పుడు తెలంగాణలో అన్నీ అభివృద్ధిలో పోటీ పడుతున్నాయని చెప్పారు కేటీఆర్. జాతీయ స్థాయిలో 20 ఉత్తమ పంచాయతీల లిస్ట్ లో 19 తెలంగాణ గ్రామాలే ఉన్నాయన్నారు. రాజకీయాల్లో నేల విడిచి సాము చేయవద్దని సూచించారు. 60 లక్షల గులాబీ కుటుంబ సభ్యులని కలిసి.. వారితో మమేకం అవ్వాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు పక్కాగా గెలవాలని కేసీఆర్ చెప్పారని.. ఆ సీట్లు గెలిచేలా అందరూ కలిసికట్టుగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు.
Advertisement
ఇక ప్రతిపక్షాలపైనా తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేటీఆర్. నాలుగేళ్లలో ఎంపీగా బండి సంజయ్ ఏం చేశారని ప్రశ్నించారు. కనీసం ఒక చిన్న పాఠశాలనైనా తీసుకొచ్చారా? అంటూ నిలదీశారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ? తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వని దౌర్భాగ్యపు ప్రధాని ఎక్కడ? అని విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ ని పట్టుకొని బండి బ్రోకర్ అంటున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తలచుకుంటే తాను కూడా ప్రధాని మోడీని బ్రోకర్ అనగలనని.. కానీ, తనకు సంస్కారం ఉంది కాబట్టి అలా అననని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ కు సంబంధించి చేస్తున్న ఆరోపణలపైనా మండిపడ్డారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని విరుచుకుపడ్డారు కేటీఆర్.
ఇటు ఇతర బీఆర్ఎస్ నేతలు కూడా మన టార్గెట్ 100 అంటూ పార్టీ శ్రేణులకు నూరిపోస్తున్నారు. 90 నుండి 100 స్థానాలతో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని.. హ్యాట్రిక్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈడీలు, సీబీఐలు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా తమకు బీఆర్ఎస్ కార్యకర్తల బలం ఉందని అన్నారు. బీఆర్ఎస్ అంటే.. బీదలు, రైతులు, సామాన్యుల పార్టీ అని అభివర్ణించారు హరీష్ రావు.