Advertisement
ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. మోడీ సర్కార్ ను గద్దె దించుతామని కేసీఆర్ శపథం చేశారు. కేంద్ర పెద్దలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలుస్తామని.. ఈసారి తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడిస్తామని చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే చెప్పేదేముంది.. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పోటాపోటీగా తిట్టుకుంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య ట్వీట్ వార్ కొనసాగింది.
Advertisement
ముందుగా మంత్రి కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు. కేంద్రం తెలంగాణపై చూపిస్తున్న వివక్షను వివరిస్తూ ట్వీట్లలో వివరించారు. విభజన చట్టంలోని హామీలను మోడీ అమలు చేయట్లేదని.. రాష్ట్రంలోని వెన్నెముక లేని నలుగురు బీజేపీ ఎంపీలు దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తొమ్మిదేండ్లుగా అడిగితే తెలంగాణకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వటం లేదని.. కానీ గుజరాత్ లోని లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీకి రూ.20 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. గుజరాతీ బాసుల చెప్పులు మోసే దౌర్భాగ్యులను ఎన్నుకున్న ఫలితం ఇది అంటూ విమర్శలు గుప్పించారు.
మరో ట్వీట్ లో ప్రధాని మోడీ తెలంగాణకు వీటిని ఇవ్వడం లేదని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు కేటీఆర్..
కేటీఆర్ ట్వీట్
Advertisement
‘‘తెలంగాణకు…
కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
పసుపు బోర్డు ఇవ్వం – ప్రధాని
మెట్రో రెండో దశ ఇవ్వం – ప్రధాని
ఐటీఐఆర్ ప్రాజెక్టు ఇవ్వం – ప్రధాని
గిరిజన యూనివర్సిటీ ఇవ్వం – ప్రధాని
బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ఇవ్వం – ప్రధాని
ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వం – ప్రధాని
ప్రధాని ప్రాధాన్యతల్లో అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి?
తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి?’’ అంటూ మండిపడ్డారు కేటీఆర్.
మంత్రి ట్వీట్ కు బీజేపీ నేతలకు మండినట్టుంది. వెంటనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, చేసిన పనులను వివరిస్తూ సెటైర్లు వేశారు.
బండి సంజయ్ ట్వీట్
‘‘ఉద్యమకారులకు పార్టీలో చోటివ్వం – కేసీఆర్
దళితులకు మూడెకరాలు ఇవ్వం – కేసీఆర్
దళితులకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వం – కేసీఆర్
ఖాళీలున్నా ఉద్యోగాలను భర్తీ చెయ్యం – కేసీఆర్
నిరుద్యోగ భృతి ఇవ్వం – కేసీఆర్
డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వం – కేసీఆర్
దళితబంధు అర్హులకు ఇవ్వం – కేసీఆర్
పంచాయతీ, మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వం – కేసీఆర్
ప్రకటనలే తప్ప ఆలయాలకు సైతం నిధులు ఇవ్వం – కేసీఆర్
ముఖ్యమంత్రి ప్రధాన బాధ్యతల్లో ప్రజలకు చోటివ్వన్నప్పుడు, నిన్ను ఎందుకు భరించాలి? సహించాలి?.. అసలు, కేసీఆర్ తన పార్టీ నుంచే తెలంగాణను తొలగిస్తే, ఆయనను ఎందుకు ఈ రాష్ట్రం నుంచి తొలగించకూడదు?’’ అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు బండి సంజయ్. ప్రస్తుతం వీళ్లిద్దరి ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.