Advertisement
ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే ప్రచారం సాగుతోంది. జగన్ వరుస ఢిల్లీ పర్యటనల వెనుక పెద్ద కథే ఉందని కొందరు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణతోపాటే ఏపీలోనూ ఎన్నికలు ఉన్నా ఆశ్చర్యం లేదని అంచనా వేస్తున్నారు. అయితే.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమేనని ఇప్పటికే అన్ని పార్టీలు ప్రకటించాయి. పొత్తులు, ఎత్తులు అన్నీ ఎన్నికల వేళ బయటకు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్రను చేస్తున్నారు. రీసెంట్ గా 700 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారు. అయితే.. యాత్రలో సెల్ఫీలు దిగుతూ ప్రభుత్వానికి ఛాలెంజ్ లు విసరడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
తాజాగా పెనుకొండ నియోజకవర్గంలోని కియా ఫ్యాక్టరీ దగ్గర సెల్ఫీ దిగారు లోకేష్. ఈ పరిశ్రమ ఏపీలోనే అతిపెద్ద సింగిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్.. భారతదేశంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి పెట్టిన సంస్థ అని అన్నారు. పెట్టుబడి రూ.13వేల కోట్లు.. ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మందికి ఉద్యోగాలు వచ్చాయని తెలిపారు. ఏడాదికి నాలుగు లక్షల వాహనాలు తయారవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఇలాంటి కంపెనీని తీసుకురావాలని మీరు కలలో కూడా ఊహించలేరు వైఎస్ జగన్ అంటూ ట్వీట్ చేశారు లోకేష్.
Advertisement
కేవలం సెల్ఫీనే కాదు ప్రత్యేక వీడియోను కూడా వదిలారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చేసిన ప్రసంగం వీడియోతో తన కియా టూర్ వీడియోను మిక్స్ చేసి విడుదల చేశారు. కియా పరిశ్రమపై పెనుగొండ నియోజకవర్గంలో మాట్లాడిన జగన్.. బలవంతంగా అప్పటి ప్రభుత్వం భూములు తీసుకుంటోందంటూ అన్నారు. రైతులు ఎవరూ భూములు ఇవ్వొద్దని.. అండగా ఉంటానని నాడు జగన్ హామీ ఇచ్చారని లోకేష్ గుర్తు చేశారు. వచ్చిన కంపెనీలను వెనక్కి పంపి భూములను వెనక్కి ఇస్తానని జగన్ చెప్పారని, ఇవే భూముల్లో కియా పరిశ్రమ వచ్చి వేలాదిమందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అంటూ జగన్ ను లోకేష్ ప్రశ్నించారు.
లోకేష్ పాదయాత్ర సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం పెనుకొండ క్రాస్ క్యాంప్ సైట్ లో స్థానికులతో సెల్ఫీలు దిగారు. అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. హరిపురంలో స్థానికులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మునిమడుగు కియా ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగులతో మాట్లాడారు. ఆ తర్వాత అమ్మవారిపల్లిలో స్థానికులతో మాటామంతీ నిర్వహించారు. యువగళం పాదయాత్ర 700 కిలోమీటర్లకు చేరడంతో గుట్టూరులో శిలాఫలకం ఆవిష్కరించారు లోకేష్.