Advertisement
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సై అంటే సై అనే రేంజ్ లో యుద్ధం సాగుతోంది. ఓవైపు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తూనే.. ఇంకోవైపు పోస్టర్ల వార్ నడిపిస్తున్నారు నేతలు. పసుపు బోర్డు అంశంలో నిజామాబాద్ వ్యాప్తంగా ఎంపీ అరవింద్ కు షాకిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. దీని వెనుక బీఆర్ఎస్ వాళ్లే ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాంలో ఈడీ విచారణ తర్వాత తొలిసారి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కు కౌంటర్ గా ఉచిత ఎరువులు ఏమయ్యాయనే ఫ్లెక్సీలు కనిపించాయి. ఇది బీజేపీ పనే అని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
అయితే.. ఆత్మీయ సమ్మేళనం కోసం జగిత్యాల వెళ్లిన కవిత ఏం ప్రసంగిస్తారని అందరూ ఉత్కంఠగా చూస్తుండగా.. అనుకోని షాక్ తగిలింది. కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. కానీ, డీజే ముందు డ్యాన్స్ చేస్తూ.. బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ ఒక్క సారిగా కుప్పకూలారు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు సీపీఆర్ చేసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
Advertisement
నరేందర్ మృతితో జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు కవిత. జగిత్యాలకు చేరుకున్న తర్వాత అదే కార్యక్రమంలో బండారి నరేందర్ మృతి పట్ల సంతాపాన్ని తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబంలో మొదటి నుంచి ఉత్సాహంగా పని చేస్తున్న నరేందర్ ఆకస్మిక మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. కౌన్సిలర్ రజిని కుటుంబానికి అండగా ఉండి అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీగా తరలి వచ్చిన శ్రేణులతో మరోసారి సమావేశమై చర్చించుకుందాం అని తెలిపారు కవిత. నరేందర్ మృతి పట్ల పార్టీ నాయకులు ముఖ్య కార్యకర్తల సమక్షంలో మౌనం పాటించిన అనంతరం నేరుగా ఆయన ఇంటికి వెళ్లి నివాళులర్పించారు. భౌతికకాయానికి పులమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే, మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు, ఇతర నేతలు కూడా నివాళులు అర్పించారు.