Advertisement
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. ఫ్యామిలీతో వెకేషన్ కోసం రాజస్థాన్ వెళ్లిన పవన్.. అటు నుంచి హస్తినకు వెళ్లారు. నాదెండ్ల మనోహర్ తో కలిసి బీజేపీ నేతలతో వరుస భేటీలు అవుతున్నారు. ఏపీలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. కానీ, కలిసి కార్యక్రమాలు నిర్వహించింది ఈమధ్య తక్కువే. అదీగాక, ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తమకు మద్దతు ఇవ్వలేదని.. బహిరంగంగానే బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Advertisement
అసలు, బీజేపీతో జనసేన పొత్తు కంటిన్యూ అవుతుందా? టీడీపీతో జత కడతారా? ఇలా అనేక ప్రశ్నలు తెరపైకి రాగా, ఇప్పుడు పవన్ వరుసగా బీజేపీ నేతలను కలుస్తుండడం ఇంట్రస్టింగ్ గా మారింది. ముందుగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ మురళీధరన్ తో భేటీ అయ్యారు పవన్. ఆయన వెంట నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. దాదాపు గంటన్నరపాటు వీళ్ల సమావేశం జరిగింది.
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు జనసేన, బీజేపీ కార్యాచరణపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన పవన్.. ‘ఇంకా పలువురిని కలవాల్సి ఉంది.. అందరినీ కలిసిన తర్వాత మాట్లాడతా’ అని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ పెద్దలతో ఏం మంతనాలు చేస్తున్నారు? అని ఏపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, హోంమంత్రి అమిత్ షా ను కూడా పవన్ కలవనున్నారు.
ఈమధ్యే వరుసగా రెండు సార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు సీఎం జగన్. ఆయన టూర్ల నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ బీజేపీ నేతలతో భేటీలు అవుతుండడం ఆసక్తికరంగా మారింది.