Advertisement
వైసీపీ అధిష్టానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీడ్ పెంచారు. ప్రభుత్వంపై పోరు విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ఆయన కార్యాచరణ ఉంటోంది. ఎన్నో రోజులుగా తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ప్రశ్నిస్తున్న ఆయన.. డైరెక్ట్ ఎటాక్ కు దిగిపోయారు. పొట్టెపాలెం కలుజు వద్ద వంతెన నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ.. 8 గంటలపాటు జలదీక్షకు పూనుకున్నారు. అయితే.. ఇది ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.
Advertisement
నిరసన కార్యక్రమానికి వెళ్లేందుకు కోటంరెడ్డి సిద్ధమవ్వగా.. పోలీసులు చుట్టుముట్టారు. ఆయన్ను గృహనిర్బంధం చేశారు. దీంతో పెద్ద ఎత్తున కోటంరెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసం దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీక్షకు అనుమతి లేదని.. శాంతిభద్రతలకు సమస్యలు ఏర్పడతాయని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. కానీ, కోటంరెడ్డి మాత్రం దీక్ష చేసి తీరతానని స్పష్టం చేశారు. ఈ దీక్షపై తాను చాలా రోజుల ముందే ప్రకటించానని తెలిపారు.
Advertisement
ఎవరికీ ఇబ్బంది లేకుండా దీక్ష చేస్తానని చెప్పినా పోలీసులు అనుమతించకపోవడం సరికాదన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. మీరు డ్యూటీలు చేయడం మానేసి ఎంతో కాలం తన చుట్టూ తిరగలేరని హెచ్చరించారు కోటంరెడ్డి. జలదీక్షకు అనుమతిని ఇవ్వాలని ఎస్పీని, డీఎస్పీని కోరానని… ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చు కదా? అని ప్రశ్నించారు.
ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు పోలీసులు రౌండప్ చేశారని అసహనం వ్యక్తం చేశారు కోటంరెడ్డి. తాను కచ్చితంగా జలదీక్ష చేస్తానని.. వంతెన నిర్మాణం కోసం ఫైల్ పై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కోటంరెడ్డి హౌస్ అరెస్ట్ తో నెల్లూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన అనుచరులు ధర్నాలకు ప్లాన్ చేయకుండా ఎక్కడికక్కడే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.