Advertisement
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పది మందిపై కేసులు పెట్టారు పోలీసులు. బండికి 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. బెయిల్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు ఇదే కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు నోటీసులు పంపించారు.
Advertisement
కేసులో కీలకంగా మారిన బూరం ప్రశాంత్.. రాజేందర్ కు కూడా పేపర్ ను పంపించినట్టు పోలీసులు గుర్తించారు. హుజారాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచే ప్రశ్నా పత్రం బయటకు వచ్చినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ వ్యవహారంలో ఈటల రాజేందర్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కమలాపూర్ లో ఈటల స్టేట్ మెంట్ ను వరంగల్ పోలీసులు రికార్డ్ చేయనున్నారు.
Advertisement
మరోవైపు బీజేపీ పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. బండి సంజయ్ పై కేసు పెట్టడాన్నే తీవ్రంగా తప్పుబడుతున్న కమలనాథులు ఈటల రాజేందర్ కు నోటీసులు ఇవ్వడం.. బీజేపీ టార్గెట్ గానే దర్యాప్తు కొనసాగుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వం కక్షపూరితంగానే పోలీసుల చేత కేసులు పెట్టించి, నోటీసులు పంపించి వేధింపులకు గురి చేస్తోందని ఫైరవుతున్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని డౌట్స్ వ్యక్తం చేశారు. వరంగల్ సీపీ మొన్న మాట్లాడిన దానికి నిన్న మాట్లాడిన దానికి చాలా తేడా ఉందన్నారు. అసలు, హిందీ పేపర్ ను ఫోటో తీసిన వ్యక్తికి, బీజేపీకి ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. పరీక్షా కేంద్రం వద్ద ఒక పోలీస్ కూడా లేడా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రశాంత్ పంపించారు కాబట్టి బండి ముద్దాయి అయ్యారని.. అధికార పార్టీ న్యూస్ పేపర్, ఛానల్ కి ప్రశ్నాపత్రం వెళ్లిందా? లేదా? సీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంతమంది రాజకీయ నాయకులకు అది వెళ్ళిందో చెప్పాలన్నారు. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు ఎందరు ఉన్నారు? అని ప్రశ్నించారు రఘునందన్.