Advertisement
పదో తరగతి హిందీ పేపర్ లీకేజ్ రాజకీయ ప్రకంపనలకు దారి తీసింది. పేపర్ బయటకొచ్చిన కొన్ని గంటల్లో సూత్రధారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటూ అరెస్ట్ చేయడం.. ఆ వెంటనే న్యాయమూర్తి రిమాండ్ విధించడం.. అన్నీ చకచకా జరిగిపోగా.. బీఆర్ఎస్, బీజేపీ మధ్య యుద్ధం పీక్స్ కు చేరింది. నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ కు.. బీజేపీ నేతలతో లింక్స్ ఉన్నాయని పోలీసులు బలంగా చెప్తున్నారు. బండి డైరెక్షన్ లోనే లీకేజ్ వ్యవహారం జరిగిందని అభియోగాలు మోపారు.
Advertisement
అయితే.. బండి సంజయ్ కు బెయిల్ రావడంతో ఆయన కరీంనగర్ జైలు నుంచి బయటకొచ్చారు. వచ్చీరాగానే మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు. ప్రశ్నాపత్రం ఎవరైనా లీక్ చేస్తారా? తెలుగు పేపర్ ఎవరు లీక్ చేశారు? చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవే.. మావి కాదు అంటూ ఫైరయ్యారు. కేటీఆర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
టీఎస్పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు లక్ష రూపాయల సాయం చేయాలన్నారు బండి. ఎంపీగా ఉన్న తనపట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉందని… పోస్టులు, పైసల కోసమే పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ఎవరో ప్రశ్నాపత్రం పంపిస్తే తనకేం సంబంధమన్న సంజయ్.. పేపర్ లీక్ తో సంబంధం లేదని తన పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తానని తెలిపారు. తాను కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్న సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా? అని అడిగారు బండి సంజయ్.
మరోవైపు ఇదే కేసుకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నోటీసులు అందుకున్నారు. అధికారులు శుక్రవారం విచారణకు రావాలని చెప్పగా.. 10న వస్తానని ఆయన సమాచారం ఇచ్చారు. ఈటల పీఏలు రాజు రెడ్డి, నరేందర్ లకు కూడా నోటీసులు అందగా.. వారిద్దరు డీసీపీ కార్యాలయానికి వెళ్లారు. విచారణ సందర్భంగా ఇద్దరి స్టేట్ మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఇద్దరి మొబైల్స్ ను కూడా విచారణ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.