Advertisement
హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ రియల్ గానూ స్వరం పెంచారు. ఎన్నడూ లేనిది వైసీపీ సర్కార్ పై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. ఏపీలో వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని వ్యాఖ్యానించారు. ఆ విషయం జగన్ కూ తెలుసన్న ఆయన.. అందుకే, వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీతో టచ్ లోకి వస్తున్నారని బాంబ్ పేల్చారు. వారిలో రోజురోజుకీ అసంతృప్తి పెరిగిపోతోందని తెలిపారు. వైసీపీ అరాచకాల్ని ప్రశ్నించేందుకు అంతా ముందుకు రావాలని కోరారు.
Advertisement
జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు రావడం లేదని ఆరోపించారు బాలయ్య. ముఖ్యమంత్రికి మెగా బైట్ కు, గిగా బైట్ కు తేడా కూడా తెలియదని ఎద్దేవ చేశారు. సలహాదారుల మాట కూడా వినరని, జగన్ లో అదో తరహా సైకో ప్రవర్తన ఉందని ఆరోపించారు. వైసీపీలో బబుల్ త్వరలో బద్దలవుతుందన్న బాలయ్య.. రాబోయే రోజుల్లో జగన్ ఇంకా పిచ్చిపిచ్చిగా చేస్తారని సెటైర్లు వేశారు.
Advertisement
తనను మించిన సైక్రియాటిస్ట్ ఎవరు లేరని.. అంతా తన గురించి ఏదో అనుకుంటారని, తాను మనసులో ఉన్నదే మాట్లాడతానని బాలకృష్ణ చెప్పారు. తనకు మనుషుల మనస్తత్వాల గురించి బాగా తెలుసని, సైకాలజీ చదవకపోయినా అందరి సైకాలజీ తెలుసన్నారు. జగన్ కు పాలించడం చేత కాదని విమర్శించారు. ప్రజాసేవ చేయాలని కొంతమంది వైసీపీ నేతలకు ఉన్నప్పటికీ.. ఆయన చేయనివ్వరని అన్నారు. పబ్జీ ఆడుకుంటుంటారని ఎద్దేవ చేశారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు బాలయ్య పంచ్ లకు వైసీపీ నుంచి కౌంటర్లు కూడా వెంటనే వచ్చేశాయి. బాలకృష్ణ కూడా జగన్ పై మాట్లాడడం హాస్యాస్పదమన్నారు మంత్రి అమర్నాథ్. వెన్నుపోటిదారుడికి సహకరించిన వాళ్లా తమ సీఎం గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోకేష్ పాదయాత్ర లో అన్ స్టాపబుల్ కంటే ఎక్కువ కామెడీ జరుగుతోందని చురకలంటించారు. అసలు, బాలకృష్ణకు రాష్ట్రం గురించి అవగాహన ఎంత అని ప్రశ్నించారు. ఒక్కరోజైనా నియోజకవర్గం గురించి మాట్లాడారా అని నిలదీశారు. రాసిచ్చిన డైలాగులు చెప్పేస్తే జనం ఏదో అనుకుంటారని భావిస్తే బాలకృష్ణ కంటే అమాయకుడు మరొకరు ఉండరంటూ హితవు పలికారు అమర్నాథ్.
ఇటు సోషల్ మీడియాలో ఇరు పార్టీల కార్యకర్తలు ఈ డైలాగ్ వార్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. జగన్ వైఫల్యాలను టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తుంటే.. మీ హయాంలో చేసిందేంటని వైసీపీ వర్గాలు నిలదీస్తున్నాయి.