Advertisement
అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ తరఫున సీఎంగా చేశారు. సమైక్యాంధ్ర పార్టీ అంటూ హడావుడి చేశారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత కనుమరుగయ్యారు. సీన్ కట్ చేస్తే.. 2018లో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. కానీ, ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనే మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2010 నవంబర్ 25 నుంచి 2014 మార్చి 1 వరకు సీఎంగా పనిచేశారు నల్లారి. శాసనసభ స్పీకర్ గా, ప్రభుత్వ చీఫ్ విప్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
Advertisement
తిరిగి కాంగ్రెస్ లో చేరినా.. అంత యాక్టివ్ గా ఉండలేదు ఈయన. పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉందనుకోండి. అది వేరే విషయం. అయితే.. ఏపీ బీజేపీలో ఉన్న నాయకత్వ లేమిని భర్తీ చేయగలనన్న నమ్మకంతో కాషాయ కండువా కప్పుకున్నారు నల్లారి. ఢిల్లీలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, అరుణ్ సింగ్, లక్ష్మణ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో ఈయన 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Advertisement
బీజేపీలో చేరిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కిరణ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధినేత చాలా తెలివైనవాడు కానీ.. తనంతట తానుగా ఆలోచించడు.. ఎవరి సలహా వినడు అంటూ వ్యాఖ్యానించారు. వారికి అధికారం కావాలి.. కానీ, బాధ్యత అక్కరలేదన్నారు. బీజేపీకి ఒక విజన్ ఉందని, యువతలో మంచి ఫాలోయింగ్ ఉందని, దేశాభివృద్ధిపై చక్కటి ప్రణాళిక ఉందని చెప్పారు. ఇలాంటి నాయకత్వంలోనే తాను పనిచేయాలని భావించినట్లు చెబుతూ పార్టీ బలోపేతం కోసం తానొక సైనికుడిలా పనిచేస్తానని తెలిపారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడుతానని ఎప్పుడూ ఊహించలేదన్న నల్లారి.. పార్టీ నేతల తప్పుడు నిర్ణయాల వల్లే ఈ చర్య తీసుకున్నానని చెప్పారు. కాంగ్రెస్ నేతల తప్పుడు నిర్ణయాల వల్ల అన్ని రాష్ట్రాల్లో పార్టీ దెబ్బతిందని వ్యాఖ్యానించారు. వారు ప్రజలతో మమేకమై నాయకుల అభిప్రాయాలను తీసుకోరని అన్నారు. అయితే.. నల్లారి వ్యాఖ్యలపై హస్తం నేతలు భగ్గుమంటున్నారు. ఆయన వల్ల ఎలాంటి యూజ్ లేదని విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీకి కూడా అంతేనని సెటైర్లు వేస్తున్నారు.