Advertisement
ఈమధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సినిమా బలగం. పల్లెటూరి సెంటిమెంట్ ను, కుటుంబ బంధాల గొప్పతనాన్ని ఎంతో భావోద్వేగంతో తెరకెక్కిన ఈ చిత్ర బృందాన్ని భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్మానించారు. నల్గొండలోని గుండగోని మైసయ్య ఫంక్షన్ హాల్ లో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమం జరిగింది.
Advertisement
దర్శకుడు వేణు, నిర్మాత దిల్ రాజు, ఆయన కుమార్తె హన్షిత, ఇతర నటీనటులు హాజరయ్యారు. ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సీఈవో గోనారెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిత్ర బృందాన్ని సన్మానించారు. మూవీ క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టించేలా పాట పాడిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు వెంకట్ రెడ్డి.
Advertisement
ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ.. దిల్ రాజు దిల్లున్న మంచి మనిషి అని కొనియాడారు. ఆయన తీసిన ప్రతీ సినిమా చూస్తుంటానని.. దిల్ రాజు తలుచుకుంటే భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరని అన్నారు. కానీ, కొత్తవారిలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ సినిమాలు తీస్తారని చెప్పారు. ప్రజలను మేలుకొలిపేలా ఆయన సినిమాలుంటాయన్నారు. అలాగే, దిల్ రాజు కుమార్తె హన్షిత.. దిల్ రాజు ప్రొడక్షన్ పెట్టి ఆయనకంటే వంద అడుగులు ముందేకేశారని ప్రశంసించారు.
‘‘నేను తరచూ సినిమాలు చూస్తుంటా.. నా మనసుకు దగ్గరైన చిత్రం బలగం. దర్శకులు వేణు ఎంతో గొప్పగా తెరకెక్కించారు. బలగం సినిమాతో జనంలో మార్పు వస్తోంది. అన్నదమ్ములు కలుస్తున్నారు. తల్లిదండ్రులను దగ్గరకు తీసుకుంటున్నారు. ఈ సినిమా నాకు ఎంతగా నచ్చిందంటే.. ఇప్పటివరకు ఆరుసార్లు చూశాను. మొగిలయ్య చరిత్ర సృష్టించారు. క్లైమాక్స్ పాటను నిలిచిపోయేలా చేశారు. అందరి హృదయాలను తాకేలా పాడారు ఆ దంపతులు. మొగిలయ్య డయాలసిస్ ఖర్చులన్నీ భరిస్తాను. కిడ్నీ మార్పిడికి నా వంతు సాయం చేస్తా. ప్రతీక్ ఫౌండేషన్ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది’’ అని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.