Advertisement
ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన బీజేపీలో జోష్ నింపితే.. బీఆర్ఎస్ కు పుండు మీద కారం జల్లినట్టైంది. ఇప్పటికే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారని ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు ప్రధాని వచ్చి అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ సహకరించడం లేదని విమర్శలు చేశారు. దీంతో గులాబీ దండు కదిలింది. మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసబెట్టి మీడియా ముందుకొచ్చారు. మోడీని టార్గెట్ చేస్తూ విమర్శల దాడి కొనసాగించారు.
Advertisement
కడుపులోని విషం కక్కేందుకే ప్రధాని తెలంగాణ పర్యటనకు వచ్చినట్టు ఉందని అన్నారు మంత్రి హరీష్ రావు. ప్రధాని ప్రసంగం మొత్తం సత్యదూరమని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు వంటివి లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని తెలిపారు. రైతుబంధును కాపీ కొడితే పీఎం కిసాన్ అయ్యిందని, రైతుబంధుతో పోలిస్తే ఆ పథకం సాయం ఎంత? అని ప్రశ్నించారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదని ప్రధాని అనడం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు హరీష్.
Advertisement
మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మోడీ అబద్ధాలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలుపై మోడీ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కేంద్రం బియ్యం ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడం లేదని పచ్చి అబద్ధం చెప్పారని ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్ళలో కేంద్రం ఓక్క రేషన్ కార్డు పెంచలేదని.. ధాన్యం కొనకుండా నూకలు తినమని అవహేళన చేసిందని మండిపడ్డారు. ప్రధానిది అదానీ కుటుంబమేనంటూ విమర్శలు చేశారు గంగుల.
తెలంగాణ ప్రభుత్వంపై మోడీ తప్పుడు విమర్శలు చేశారని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్. అధికారిక కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడటం ఏంటని అడిగారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచిందని.. కేంద్రానికి తెలంగాణ నుంచే ఎక్కువ నిధులు వెళ్తున్నాయని వివరించారు. రాష్ట్ర అభివృద్ధిపై తమకు నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. అయినా, వందే భారత్ రైలును ఎన్ని సార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించారు తలసాని. సింగరేణిని అదానీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వీళ్లే కాదు ఇంకా ఇతర బీఆర్ఎస్ నేతలు మోడీ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.