Advertisement
ఒక్కో రాష్ట్రంలో విస్తరించుకుంటూ.. జాతీయ పార్టీగా అవతరించాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఎన్నో ఆశలతో ఉన్నారు. అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు ఊహించని షాకిచ్చింది. ఏపీలో బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ గుర్తింపును తొలగించింది. బీఆర్ఎస్ తెలంగాణలో మాత్రమే రాష్ట్ర పార్టీగా కొనసాగుతుందని వెల్లడించింది.
Advertisement
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితి స్టేట్ పార్టీగా గుర్తింపు పొందింది. కానీ, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో తగిన అర్హతలను సాధించలేకపోవడంతో ఆ హోదాను ఎత్తివేస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది ఈసీ. రాష్ట్ర హోదాను ఎందుకు తీసేయకూడదంటూ మూడుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చినా ఆ పార్టీ నుంచి స్పందన లేదని స్పష్టం చేసింది.
Advertisement
బీఆర్ఎస్ ఎక్కువగా మహారాష్ట్ర, ఏపీపై ఫోకస్ పెట్టింది. మహారాష్ట్రంలో ఇప్పటికే రెండు భారీ సభలు నిర్వహించగా.. రేపోమాపో ఏపీలోనూ జరిపేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే విశాఖ ఉక్కు అంశాన్ని నెత్తిమీదకెత్తుకుంది. ఈ అంశంతో అక్కడ రాజకీయాలు నడిపేందుకు మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పుడు ఈసీ నిర్ణయంతో బీఆర్ఎస్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో అనేది ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చింది ఈసీ. ఆ పార్టీల జాతీయ హోదాను రద్దు చేసింది. అయితే.. ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్తగా జాతీయ పార్టీ హోదా ఇచ్చింది. ఎన్నికల సంఘం తాజా నిర్ణయంతో.. ప్రస్తుతం బీజేపీ, బీఎస్పీ, సీపీఎం, కాంగ్రెస్, ఆప్, నేషనల్ పీపుల్స్ పార్టీ ఆఫ్ మేఘాలయ.. జాతీయ పార్టీ హోదా కలిగిన పార్టీలుగా ఉన్నాయి.