Advertisement
టెన్త్ పేపర్ లీకేజ్ కేసు బీజేపీ నేతలకు చుట్టుకుంది. దీనికి కారణంగా నిందితుల్లో ఒకడైన ప్రశాంత్ కు బీజేపీ నేతలతో సత్సంబంధాలు ఉండడమే. పోలీసులు ఆ దిశగానే దర్యాప్తు కొనసాగిస్తూ.. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేశారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన బయటకొచ్చారు. అయితే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా పోలీసులు నోటీసులు పంపి విచారణకు పిలిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన విచారణకు హాజరయ్యారు.
Advertisement
ఈటలను వరంగల్ డీసీపీ, ఏసీపీ గంటపాటు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ కేసులో నిందితునిగా ఉన్న ప్రశాంత్.. బండి సంజయ్ తో పాటు ఈటల రాజేందర్ కు వాట్సాప్ ద్వారా ప్రశ్నా పత్రాన్ని పంపించాడు. ఈ అంశానికి సంబంధించి వివరాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విచారణ ముగించుకుని బయటకు వచ్చిన ఈటల పోలీసులు తన సెల్ ఫోన్ తీసుకొని తన సమక్షంలోనే పరిశీలించారని పేర్కొన్నారు. తాను బాధ్యత గల ప్రజాప్రతినిధినని, అందుకే విచారణకు వచ్చానని వెల్లడించారు.
Advertisement
తన నియోజకవర్గం నుంచి ఓ కార్యకర్త మెసేజ్ పంపాడని.. దాన్ని ఒపెన్ కూడా చేయలేదన్నారు ఈటల. తనకు ప్రశాంత్ నుండి ఎలాంటి మెసేజ్, ఫోన్ రాలేదని చెప్పారు. కేసీఆర్ ప్రగతి భవన్ లో కూర్చుని కుట్రలు చేశారని ఆరోపించారు. కుట్రపూరితంగా తన చేతిలోని అధికారులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టారని అన్నారు. దేశంలోనే రిచెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు.
30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్న కేసీఆర్.. ప్రజల దృష్టిని మరల్చడం కోసమే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు రాజేందర్. తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులతో అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం.. తన ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ పిల్లల భవిష్యత్ కోరే పార్టీ అని స్పష్టం చేసిన ఆయన.. లీకేజీ అబద్ధం అని.. దానికి ఆస్కారమే లేదని తేల్చిచెప్పారు.