Advertisement
ఉమ్మడి రాష్ట్రం తెలంగాణ, ఏపీగా మారి ఏళ్లు గడుస్తున్నాయేగానీ.. విభజన హామీలు మాత్రం నెరవేరడం లేదు. కేంద్రం మాటలకే పరిమితం అవుతోంది. తెలుగు రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోంది. ఇవన్నీ ఈమధ్య కాలంలో బీజేపీ టార్గెట్ గా బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్స్ విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడుతోంది. విభజన సమయంలో ఏపీలోని కడపలో, తెలంగాణలోని బయ్యారంలో స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. 9 ఏళ్లు అయినా.. ఇంతవరకు ఇవి కార్యరూపం దాల్చలేదు.
Advertisement
కొత్త వాటి సంగతి దేవుడెరుగు.. ఉన్న ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్ పైనా కేంద్రం కుట్రలు చేస్తోందని అంటోంది బీఆర్ఎస్. ఈ క్రమంలోనే బిడ్డింగ్ విషయంలో కలగజేసుకోవాలని చూస్తోంది. టెండర్ లో పాల్గొనేందుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం కోసం సింగరేణి అధికారులను సైతం ఫ్యాక్టరీకి పంపారు కేసీఆర్. ముగ్గురు డైరెక్టర్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు వెళ్లి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ఈ విషయంలో ఏపీ మంత్రి అమర్నాథ్ బీఆర్ఎస్ సర్కార్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.
Advertisement
ఇదిలా ఉంటే.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే విశాఖ పర్యటనకు వచ్చారు. ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో రోజ్ గార్ మేళాకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా ఆలోచనలు చేయడం లేదని అన్నారు. బిడ్డింగ్ లో పాల్గొనాలనే తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఓ ఎత్తుగడ మాత్రమే అని వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరణ కంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని చెప్పారు.
స్టీల్ ప్లాంట్‌ను బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కేంద్రమంత్రి. ముడిసరకు పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని స్పష్టం చేశారు. ఆర్ఐఎన్ఎల్ అధికారులతో భేటీ అవుతున్నామని తెలిపారు. ఈనెల 15 వరకూ బిడ్డింగ్ గడువు ఉండగా.. కేంద్రమంత్రి చేసిన తాజా వ్యాఖ్యలతో ఈ అంశం ఇంట్రస్టింగ్ గా మారింది.