Advertisement
పలు కేసుల్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఏదో ఒక లేఖతో నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ కు ఓవైపు ప్రేమ లేఖలు పంపుతూనే.. ఇంకోవైపు ఆప్, బీఆర్ఎస్ పై సంచలన ఆరోపణలు చేస్తూ లేఖలు విడుదల చేస్తున్నాడు. తాజాగా ఎమ్మెల్సీ కవితే లక్ష్యంగా లేఖ వదిలాడు. ఇందులో ఎన్నో కీలక విషయాలను ప్రస్తావించాడు. లేఖతో పాటు తన వాట్సాప్ చాట్ ను కూడా బయటపెట్టడం సంచలనంగా మారింది.
Advertisement
కవితక్క-టీఆర్ఎస్ అనే పేరుతో ఉన్న నెంబర్ తో తాను చాట్ చేసినట్లు సుఖేష్ లేఖలో తెలిపాడు. ఏకే, ఎస్కే,ఏపీ సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో చాటింగ్ చేసినట్లు చెప్పాడు. 15 కేజీల నెయ్యి డెలివరీ చేశానని.. కోడ్ భాషలో చాట్ లో తెలిపాడు. మొత్తం 6 పేజీల లేఖతో పాటు కవితతో చేసినట్లుగా చెప్పుకుంటున్న వాట్సాప్ స్కీన్ షాట్స్ రిలీజ్ చేశాడు. దీంతో ఈ వ్యవహారాన్ని మీడియా బాగా హైలైట్ చేసింది. అయితే.. ఇదంతా తప్పుడు ప్రచారమని కవిత అంటున్నారు.
Advertisement
సుఖేష్ లేఖ, మీడియా కథనాలపై స్పందించారు కవిత. గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, మరీ ముఖ్యంగా తన మీద ఉద్దేశపూర్వకంగా కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ పొందుతున్న ప్రజాదరణను, కేసీఆర్ జాతీయ స్థాయి కార్యాచరణను రాజకీయంగా ఎదుర్కునే ధైర్యం లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
పేపర్లు, టీవీ ఛానల్స్, యూట్యూబ్ మీడియాల ద్వారా పని గట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కవిత. ఒక ఆర్థిక నేరగాడు, ఒక అనామక లేఖను విడుదల చేయడం.. దాని వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం.. ఆ తర్వాత ఎంపీ అరవింద్ బీజేపీ టూల్ కిట్ లో భాగంగా సామాజిక మాధ్యమాల్లో బురదజల్లే కార్యక్రమాన్ని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.