Advertisement
దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేశారని మండిపడ్డారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజ్ఞాపూర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలోనూ పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వడగళ్ల వానొచ్చి గజ్వేల్ తోపాటు తుర్కపల్లి, ఆలేరు సహా చాలా చోట్ల రైతులు నష్టపోయారని.. కానీ, ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు.
Advertisement
ఎంతసేపూ.. ఏపీలో ఎలా బలపడదామా? మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేద్దామా అనే కేసీఆర్ ఆలోచిస్తున్నారని.. రాష్ట్ర ప్రజలను గాలికొదిలేశారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయి.. 3 నెలల్లో నోటిఫికేషన్ రాబోతోందని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ఈసారి ప్రజలు పట్టం కడతారన్న నమ్మకం ఉందన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులు తమవైపే ఉన్నారని తెలిపారు. వారికి నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని.. ఒకటా రెండా.. ఆయన మోసాలు ఎన్నో అంటూ విమర్శించారు.
Advertisement
‘‘టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేశారు.. గతంలో ఇంటర్ పరీక్షల పేపర్లు దిద్దే విషయంలో అక్రమాలు జరిగాయి. 90 మార్కులు వస్తాయని అనుకున్న విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి.. చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. టెన్త్ పేపర్ లీకేజ్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. పరీక్షలు జరపడం రాదు.. పేపర్లు దిద్దడం రాదు.. ఉన్న ఖాళీలు భర్తీ చేయరు.. ఇన్నాళ్లూ ఏం చేశారు కేసీఆర్’’ అంటూ ఫైరయ్యారు.
జాతీయ రాజకీయాలు అంటున్న కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాగే పేపర్ లీకేజ్ లు చేస్తారా? ఉద్యోగ భార్యాభర్తలను విడదీస్తారా? పేపర్లు దిద్దడంలో అవకతవకలు చేస్తారా? అంటూ నిలదీశారు కోమటిరెడ్డి. ఇవన్నీ మారాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలను కోరారు.