Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మొదట్నుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. నిందితులను పలు దఫాలు కస్టడీకి తీసుకున్నసిట్.. విచారణ చేసి కీలక విషయాలు రాబట్టింది. అయితే.. ఒక్కోసారి నిందితులు చెబుతున్న దానికి జరిగిన దానికి సంబంధం ఉండడం లేదు. దీంతో గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్న అధికారులు.. వారి నుంచి వివరాలను రాబడుతున్నారు. అయితే.. ఈ స్కాంలో పాస్ వర్డ్ అంశం మాత్రం మిస్టరీగా మారింది.
Advertisement
నిందితులేమో కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి డైరీ నుంచి పాస్ వర్డ్ వివరాలు తెలుసుకున్నామని చెబుతున్నారు. కానీ, డైరీలో అలాంటివేం కనిపించడం లేదు. దీంతో ఈ అంశం పెద్ద మిస్టరీగా మారింది. ప్రధాన నిందితులు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ రెడ్డికి శంకర లక్ష్మి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఎలా తెలిసింది? అనే అంశంపై ఆరా తీస్తున్నారు అధికారులు. పోలీసుల దర్యాప్తు, సిట్ కస్టడీలో వీరిద్దరూ ఒకేవిధంగా సమాధానమిచ్చారు.
Advertisement
శంకర లక్ష్మి డైరీలో రాసిన పాస్ వర్డ్ ద్వారా లాగిన్ అయ్యామని చెప్పారు. దీంతో ఆమె డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, అందులో ఎక్కడా కూడా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ రాసినట్లుగా ఆధారాలు లభించలేదు. శంకర లక్ష్మి కూడా ఈడీ అధికారుల విచారణలో, సిట్ పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పారు. మరోవైపు ప్రశ్నా పత్రాల కొనుగోలు వ్యవహారంలో వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆ అనుమానితుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.
శంకర లక్ష్మి బలమైన పాస్ వర్డ్ పెట్టుకోకపోవడంతో రాజశేఖర్ రెడ్డి సునాయాసంగా లాగిన్ అయి ప్రశ్నా పత్రాలున్న ఫోల్డర్ ను ఓపెన్ చేశాడని అనుకుంటున్నారు సిట్ అధికారులు. కేసును అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. గత నెల 11న టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగుచూసింది. కేసులో ఇంతవరకు 18 మంది నిందితులను గుర్తించి.. 17 మందిని అరెస్ట్ చేశారు. గ్రూప్-1 ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించిన రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడు. అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీచేశారు. మొత్తంగా ప్రస్తుతానికి శంకర లక్ష్మి పాస్ వర్డ్ అంశం చుట్టూ వ్యవహారం నడుస్తోంది.