Advertisement
సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకా కేసులో ఈమధ్యే సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో కుట్ర కోణాన్ని అత్యంత వేగంగా బయటపెట్టాలని.. 6 నెలల్లో కోర్టు ట్రయిల్ ప్రారంభించాలని.. లేదంటే నిందితుల రెగ్యులర్ బెయిల్ కు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. దీంతో ఆనాటి నుంచి సీబీఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. విచారణలు, నోటీసులతో తెగ హడావుడి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది.
Advertisement
ఆదివారం తెల్లవారుజామున పులివెందుల చేరుకున్న సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే పులివెందుల నుంచి హైదరాబాద్ కు తరలించారు. ఆ సమయంలో అవినాష్ అనుచరులు కాస్త హడావుడి చేశారు. అధికారుల వాహనాలను అడ్డుకునేందుకు చూశారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తర్వాత భాస్కర్ రెడ్డిని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. భాస్కర్ రెడ్డిపై సెక్షన్ 130బీ, రెడ్ విత్ 302, 201 కింద కేసు నమోదు చేశారు సీబీఐ అధికారులు. ఆయన భార్య లక్ష్మికి అరెస్ట్ సమాచారం ఇచ్చి హైదరాబాద్ కు తరలించారు.
Advertisement
2019 మార్చి 15న వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో గుండెపోటుతో మరణించారనే ప్రచారంలో భాస్కర్ రెడ్డే కీలక సూత్రధారి అనే ఆరోపణలు వచ్చాయి. అదేవిధంగా సాక్ష్యాలు చెరిపేయడంలో కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా హత్యకు ముందు సునీల్ యాదవ్ భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లు ఆధారాలను కూడా సేకరించింది. అంతేకాకుండా దస్తగిరి కదిరికి వెళ్లి గొడ్డలి తెచ్చే వరకు భాస్కర్ రెడ్డి ఇంట్లో సునీల్ యాదవ్ వేచి చూసినట్లు.. అతను ఇంట్లో ఉన్నప్పుడు భాస్కర్ రెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని సీబీఐ వివరించింది.
ఇటు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించారు సీబీఐ అధికారులు. రెండు రోజుల క్రితం అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని కడపలో అరెస్ట్ చేశారు. తాజాగా భాస్కర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో తర్వాతి అరెస్ట్ అవినాష్ రెడ్డేనని అంటున్నారు.