Advertisement
రాజకీయాల్లో తిట్లు కామనైపోయింది. ఇవి ఒక్కోసారి పరిధి దాటి వినిస్తున్నాయి. తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతుండడంతో విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కొందరు నేతలు తిట్ల పురాణం అందుకుంటుంటే.. మరికొందరు తెలివిగా సెటైర్లు వేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నేత రెడ్యానాయక్.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Advertisement
బెదిరించడం.. ఎదిరించడం, బ్లాక్ మెయిల్ చేసి వసూళ్లు చేయడం రేవంత్ రెడ్డి నైజమని అన్నారు రెడ్యానాయక్. తాను పీసీసీ హోదాలో ఉండి వుంటే హల్చల్ సృష్టించే వాడినన్నారు. మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో రెడ్యానాయక్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేస్తే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కనీసం నిరసన కార్యాచరణ ప్రకటించలేని అసమర్థుడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Advertisement
భూమికి మూరెడు ఉండే రేవంత్ ని పీసీసీ పదవి నుంచి దించాలని ఆ పార్టీ నేతలే చూస్తున్నారని అన్నారు రెడ్యా నాయక్. ఈసారి డోర్నకల్ నుంచి తానే పోటీలో ఉంటానన్నారు. ఎమ్మెల్యే టికెట్ గురించి రెడ్యా నాయక్ కుటుంబంలో పోటీ వుంది. ఈసారి ఆయన పోటీలో ఉండరని, ఆయనకు బదులుగా వారసులు టికెట్ ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆ వార్తలకు రెడ్యానాయక్ చెక్ పెట్టారు. ఈ సారి కూడా తాను పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు.
మరోవైపు, సొంత పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు రెడ్యా. పార్టీలో ఒక్కరిద్దరూ ఆగర్భ శత్రువులు ఉన్నారని అన్నారు. వారికి తనను చూస్తే నిద్రపట్టదని, తనపై ఇప్పటికే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కొందరు పార్టీ పేరు చెప్పుకుని లక్షల రూపాయలు సంపాదించుకుంటున్నారని దుయ్యబట్టారు. అంతేకాక, వారు వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. అలా చేయకుండా పార్టీలోని నాయకులు దాన్ని గమనించాలని కోరారు.