Advertisement
సంచలనం రేపిన వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే ప్రచారం జరిగింది. అయితే.. అనూహ్యంగా హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వివేకా హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని అవినాష్ వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిగింది. వాదనల తర్వాత ఈనెల 25 వరకు అవినాష్ ను అరెస్ట్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది న్యాయస్థానం. అయితే.. అప్పటిదాకా ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది.
Advertisement
విచారణ సందర్భంగా ఇరు వర్గాల లాయర్ల మధ్య వాడీవేడి వాదనలు కొనసాగాయి. కోర్టులో అవినాష్ రెడ్డి, సునీత న్యాయవాదుల మధ్య పోటాపోటీ వాదనలు జరిగాయి. ఇంకా చెప్పాలంటే చిన్నపాటి వాగ్వాదమే జరిగింది. రాజకీయ కారణాలతోనే ఈ కేసులో అవినాష్ ను ఇరికిస్తున్నారని.. హత్యతో సంబంధం ఉన్న ఎర్రగంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారని ఆయన తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. పైగా, దస్తగిరి మీడియాతో మాట్లాడిన దాన్ని సునీత లాయర్ సమర్థించడమేంటని నిలదీశారు.
Advertisement
సునీత తరపు న్యాయవాది దీనిపై స్పందిస్తూ.. వివేకా హత్య రోజు అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ ఆయన ఇంటికి వెళ్లారని… పైగా, గుండెపోటు అంటూ చిత్రీకరించేందుకు చూశారని కోర్టుకు తెలిపారు. ఎప్పుడు నోటీస్ ఇచ్చినా అరెస్ట్ చేయొద్దని అవినాష్ కోర్టుకెళ్తున్నారని, విచారణ అడ్డుకోవడానికే ఆయన ప్రయత్నిస్తున్నారని వాదనలు వినిపించారు. ఇరు వాదనల తర్వాత అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇస్తూ.. కొన్ని కండిషన్స్ పెట్టింది న్యాయస్థానం. ప్రతిరోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలని… విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది.
మరోవైపు వివేకా కేసులో అరెస్ట్ అయి జైలు పాలైన అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి అనుమతిచ్చింది న్యాయస్థానం. దీంతో బుధవారం నుంచి ఆరు రోజులపాటు ఇద్దరినీ సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. అవినాష్ రెడ్డిని సైతం వారితో కలిపి విచారిస్తామని సీబీఐ వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని, ఆ తర్వాత చెంచల్ గూడ జైలులో అప్పగించాల్సిందిగా సీబీఐ అధికారులకు కోర్టు స్పష్టం చేసింది.