Advertisement
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంపై పోరును మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది కాంగ్రెస్. జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అలాగే, భారీ బహిరంగ సభలను నిర్వహించి అగ్ర నేతలను రాష్ట్రానికి రప్పించాలని నిర్ణయించింది. ఓవైపు ప్రభుత్వంపై ఎటాక్ కొనసాగిస్తూనే.. ఇంకోవైపు నిరుద్యోగులను తమ వైపు తిప్పుకునేలా కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.
Advertisement
ఈ నెల 21న నల్గొండలోని మాహాత్మాగాంధీ యూనివర్సిటీలో ముందుగా నిరసన కార్యక్రమం నిర్వహించనుంది టీపీసీసీ. అలాగే, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్ లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. మే 4 లేదా 5 తేదీల్లో హైదరాబాద్ సరూర్ నగర్ మైదానంలో నిరుద్యోగుల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఈ సభకు పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ హాజరవుతారని చెప్పింది.
Advertisement
ఇటు, మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం కూడా ప్రారంభించనుంది కాంగ్రెస్. దీన్ని జోగులాంబ జిల్లా నుంచి స్టార్ట్ చేయనుంది. ఇప్పటికే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి కూడా రెండోవిడతకు సిద్ధమౌతున్నారు. మరోవైపు జిల్లాల్లో నేతలు కూడా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకెళ్తోంది. ఈక్రమంలోనే నిరుద్యోగుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైంది. గ్రామ గ్రామాన ఓ ఉద్యమంలా ఈ కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్లాలని చూస్తోంది. ఇది సక్సెస్ అయితే.. ఎన్నికలకు ముందు పెద్ద ప్లస్ అవుతుందని అనుకుంటోంది హస్తం పార్టీ.