Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో తెలంగాణ సర్కార్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. బిండ్డింగ్ లో పాల్గొంటున్నట్టు ముందుగా మీడియాకు హింట్ ఇచ్చింది. దీనిపై ఫుల్ హైప్ ఏర్పడింది. తర్వాత సింగరేణికి సంబంధించిన ఉన్నతాధికారుల బృందాన్ని స్టీల్ ప్లాంట్ కు పంపింది. రెండు రోజులు అధికారులు అటూఇటూ తిరుగుతూ సందడి చేశారు. అదే టైమ్ లో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కార్మికుల క్యాంప్ లో హడావుడి చేశారు. కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Advertisement
ఇటు మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్ కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. అదే టైమ్ లో విశాఖ వచ్చిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించే ఆలోచన ప్రస్తుతానికి లేదని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణపై మరింత సమయం వేచి ఉండాలని భావిస్తున్నట్లు చెప్పారు. కొత్త యూనిట్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఈ ప్రకటనను బీఆర్ఎస్ క్యాష్ చేసుకుంది. ఇదంతా తమ వల్లే అని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకుంది. కేసీఆర్ దెబ్బ అలా ఉంటుందని స్వయంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
అయితే.. కేటీఆర్ ట్వీట్ చేసిన మరుసటి రోజే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్ర ఉక్కు శాఖ ప్రకటించింది. సంస్థలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తోందని ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉప సంహరణ ప్రక్రియ నడుస్తోందని వివరించింది. ఆర్ఐఎన్ఎల్ డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఆగిపోలేదని చెప్పుకొచ్చింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయినట్లు వచ్చిన కొన్ని మీడియా రిపోర్టుల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఇక బిడ్డింగ్ సమయం రానే వచ్చింది. కానీ, ఈ ప్రక్రియలో బీఆర్ఎస్ జాడే లేదు.
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈవోఐ కోసం దరఖాస్తు గడువు గురువారం మధ్యాహ్నంతో ముగిసింది. అందరూ ఊహించినట్లుగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి గానీ, తెలంగాణ ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి గానీ ఈవోఐ దాఖలు కాలేదు. మొత్తం 29 సంస్థలు ఈవోఐ(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) దాఖలు చేసినట్టు సమాచారం. ఎన్ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు వెల్లడించారు. ఇందులో దాదాపు ఏడు విదేశీ సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని కార్మిక నేత ఆయోధ్యరామ్ వివరించారు.
అయితే.. మొదట్లో తెగ హడావుడి చేసిన తెలంగాణ సర్కార్.. చివరి నిమిషంలో వెనుకడుగు వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనేక రకాల కథనాలు వస్తున్నాయి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో సింగరేణి పాల్గొనాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఒకవేళ కేంద్రం పర్మిషన్ ఇవ్వకుండా బిడ్ దాఖలు చేసినా టెక్నికల్ బిడ్ల స్థాయిలోనే తెలంగాణ వేసే టెండర్ తిరస్కరణకు గురవుతుంది. అదే జరిగితే కనీసం టెండర్ వేయడం కూడా రాదనే అపవాదు ఎదుర్కోవాల్సి వచ్చేది. అదే సమయంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తరహాలోనే తెలంగాణలోని నిజాం షుగర్స్ సహా ఇతర సంస్థలను తిరిగి తెరిపించాలనే డిమాండ్ ఎక్కువయ్యేది. అదే జరిగితే ఎన్నికలకు ముందు కొత్త సమస్యలు కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇవన్నీ ఆలోచించిన కేసీఆర్ చివరి నిమిషంలో వెనకడుగు వేసినట్టుగా అనుకుంటున్నారు.